షారుక్- సల్మాన్ కోసం ఎన్టీఆర్, హృతిక్
బాలీవుడ్ క్రేజీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ పేరుతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌లని తెరపైకి తీసుకొస్తూ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తున్న విషయం తెలిసిందే.;
బాలీవుడ్ క్రేజీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ పేరుతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌లని తెరపైకి తీసుకొస్తూ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్`తో ఈ స్పై యూనివర్స్‌ని 2012లో మొదలు పెట్టారు. ఆ తరువాత సల్మాన్‌తోనే 'టైగర్ జిందాహై'ని నిర్మించారు. ఆ తరువాత హృతిక్ రోషన్, టైగర్‌ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో `వార్`ని నిర్మించారు.
ఇక షారుక్ ఖాన్ కంబ్యాక్ మూవీగా తెరకెక్కిన `పఠాన్`ని కూడా ఇదే యూనివర్స్‌లో భాగంగా నిర్మించారు. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ షారుఖ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలవడమే కాకుండా ఆయన కెరీర్‌కి మరింత బూస్ట్‌ని అందించింది. దీని తరువాత మళ్లీ సల్మాన్ ఖాన్‌తో `టైగర్ 3`ని రూపొందించారు. ఇప్పటి వరకు వచ్చిన స్పై యూనివర్స్ మూవీస్ స్థాయిలో ఇది వసూళ్లని రాబట్టలేకపోయినా ఫరవాలేదు అనిపించింది.
ఇప్పుడు ఇదే యూనివర్స్‌లో ఎన్టీఆర్, హృతిక్‌లతో `వార్ 2`ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఓ భారీ క్రేజీ మూవీకి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. `వార్ 2` తరువాత ఇదే యూనివర్స్‌లో `ఆల్ఫా`ని తెరకెక్కించనున్న యష్ రాజ్ ఫిల్మ్స్ ఆ తరువాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల కలయికలో `పఠాన్ వర్సెస్ టైగర్`ని తెరపైకి తీసుకురాన్నారని బాలీవుడ్ మీడియా కథనం.
`పఠాన్`లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే `పఠాన్ వర్సెస్ టైగర్`లో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్, జాన్ అబ్రహం, అలియాభట్ గెస్ట్ క్యారెక్టర్లలో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ భారీ మల్టీస్టారర్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని `వార్`, `పఠాన్` చిత్రాల దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ తెరకెక్కించనున్నాడట.
ఈ వార్తలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో కష్టమని, అసలు ఈ ప్రాజెక్టే లేదని ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, `పఠాన్ వర్సెస్ టైగర్` ప్రాజెక్ట్ ఉంటుందని జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఈ వార్త విని సల్మాన్, షారుక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.