సూపర్ స్టార్ సినిమాకు థియేటర్లు దొరకలేదా?
`వార్ 2`- `కూలీ` చిత్రాలు బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాలు ఒకే రోజున ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి.;
`వార్ 2`- `కూలీ` చిత్రాలు బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాలు ఒకే రోజున ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి. రెండు చిత్రాలు పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిపి రజనీకాంత్ మీద దండయాత్ర చేయబోతున్నారు. ఆ ముగ్గురి మధ్య ఇలాంటి సన్నివేశం ఎదురవ్వడం ఇదే తొలిసారి. ఇంతవరకూ బాక్సాఫీస్ వార్ లో వాళ్లెప్పుడు కనిపించలేదు.
దీంతో ఈ వార్ ఎలా ముగిస్తుందో అన్న టెన్షన్ వాతావరణం అలుముకుంది. అయితే ఆదిలో నే కూలీపై వార్ ఆధిపత్య చూపిస్తోంది. 'కూలీ' చిత్రానికి హిందీ బెల్ట్ లో థియేటర్లు దొరకడం లేదట. ఉన్న థియేటర్లన్నీ `వార్ 2` బ్లాక్ చేసిందట. దొరికిన సింగిల్ స్క్రీన్ కూడా అతి కష్టం మీద దొరికినట్లు సమాచారం. ఇటు తెలుగులోనూ పరిస్థితి అలాగే కనిపిస్తోందట. ఇందులో తారక్ కూడా నటించడంతో ఇక్కడా పెద్ద ఎత్తున థియేటర్ల బ్లాకింగ్ చోటు చేసుకుంటుందట.
ఇప్పటి నుంచి ఉన్న థియేటర్లన్నీ తమ సినిమాకే కేటాయించాలని పావులు కదుపుతున్నారట. మొత్తానికి రజనీకాంత్ సినిమాకి కూడా థియేటర్ల సమస్య తలెత్తడం అన్నది ఇదే తొలిసారి కావొచ్చు. ఇంతవరకూ రజనీ సినిమాకు ఇలాంటి సమస్య ఎప్పుడు తలెత్తలేదు. ఆయన ఎలాంటి సినిమా చేసినా థియేటర్లు దండీగా దొరికేవి. ఫామ్ లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా అయినా సరే థియేటర్లు దొరకడం లేదంటే థియేటర్లలో మోనోపలి విధానం అన్నది ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతుంది.
గతంలో చిన్న సినిమాలకే థియేటర్లు దొరకక నాన అవస్తులు పడేవారు. స్టార్ హీరోల చిత్రాలకే బ్లాక్ చేసి పెట్టేవారు. కానీ ఇప్పుడు హీరోతో పనిలేకుండా గుత్తాధిపత్యం పరాకాష్టకు చేరుతుందని మరోసారి రుజువవుతుంది. మరి రిలీజ్ దగ్గరకు వచ్చే సరికి రెండు చిత్రాలు సమానంగా థియేటర్ల నుంచి పంచు కునే పంచాయతీ ఏదైనా జరుగుతుందా? అన్నది చూడాలి.