ఇక్కడ 'జన నాయగన్'...అక్కడ 'ఓ రోమియో'!
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా `జన నాయగన్`. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని రీమేక్ చేశారు.;
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా `జన నాయగన్`. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని రీమేక్ చేశారు. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా సీబీఎఫ్‌సీ సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో రిలీజ్ వాయిదాపడింది. ప్రస్తుతం మేకర్స్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయినా సరే సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటి వరకు మేకర్స్‌కు ఎలాంటి క్లారిటీ రాలేదు.
దీంతో విజయ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ మూవీ కూడా ఇదే తరహా అడ్డంకుల్ని ఎదుర్కొంటోంది. షాహీద్ కపూర్ కథానాయకుడిగా విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `ఓ రోమియో`. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, కీలక పాత్రల్లో నానా పటేకర్, అవినాష్ తివారీ, తమన్నా, దిషా పటానీ, ఫరీదా జలాల్‌తో పాటు కీలక అతిథి పాత్రలో విక్రాంత్ మెస్సే నటిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. హుసేన్ జైదీ రాసిన ఫేమస్ నవల `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి` ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవుతుందా? అంటే బాలీవుడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కారణం ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా డాటర్ సినిమా రిలీజ్‌పై స్టే విధించాలని ముంబయి హైకోర్టుని ఆశ్రయించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సినిమాలో షాహీద్ కపూర్ పోషిస్తున్న క్యారెక్టర్ పేరు `హుస్సేన్ ఉస్తారా`. ఇప్పుడు ఆయన కూతురు సనోబేర్ షేక్ తాజాగా సినిమా రిలీజ్‌ని నిలిపివేయాలని కోరుతూ కోర్టుని ఆశ్రయించింది. సినిమాను ముందుగా ప్రదర్శించాలని, అలాగే కోర్టుకు నివేదిక సమర్పించడానికి మరో వ్యక్తిని నియమించాలని సనోబేర్ షేక్ కోర్టును కోరినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా నిర్మాత సాజిద్ నడియావాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లతో పాటు నవలా రచయిత హుసేన్ జైదీపై కూడా కేసు దాఖలు చేసినట్టుగా చెబుతున్నారు.
ఇక ఈ సినిమాతో తన తండ్రిని విలన్‌గా చిత్రీకరించినట్టుగా తెలుస్తోందని, ఇది మా కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని దావాలో పేర్కొందట. అంతే కాకుండా తన తండ్రి ముంబయిలో జర్నలిస్టుగా పని చేశాడని, ముంబయి పోలీసులకు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు నేర కార్యకలాపాలను నిరోధించడంలో సహాయ సహకారాలు అందించారని, దీని కారణంగా ఆయన ప్రాణాలకు హాని ఏర్పడిందని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కోసం తన తండ్రి అప్పటి పోలీస్ కమీషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారని, ఆగస్టు 4, 1994 నాటి లేఖ ద్వారా దానికి ఆమోదం లభించిందని తన పిటీషన్‌లో సనోబేర్ షేక్ పేర్కొంది. దీంతో `ఓ రోమియో` రిలీజ్ ప్రశ్నర్థకంలో పడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.