ట్రైలర్ టాక్: సైలెంట్‌గా సిద్ధార్థ్ కెరీర్ బెస్ట్ సినిమాలో నటించాడా!
ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు జిమ్మీ షేర్ గిల్ వింగ్ కమాండర్ బి.ఎస్. ధనోవా `టోనీ` పాత్రలో నటించగా, సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రలో ప్రాణం పోశారు.
సౌత్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ కెరీర్‌లో తొలిసారిగా ఒక పూర్తి స్థాయి వార్ - మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన విభిన్నమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వెండితెరపై రొమాంటిక్ , లవర్ బాయ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా సరికొత్త రూపంలో కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`ఆపరేషన్ సఫేద్ సాగర్` పేరుతో తెరకెక్కిన ఈ మిలిటరీ డ్రామా సిరీస్ 1999 నాటి చారిత్రాత్మక కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకుంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు పాల్పడిన క్లిష్టమైన పర్వత ప్రాంతాలలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చేపట్టిన సాహసోపేతమైన వైమానిక దాడి ఆధారంగా ఈ కథను మలిచారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన మొట్టమొదటి వైమానిక ఆపరేషన్‌గా గుర్తింపు పొందిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని... అత్యంత ప్రామాణికంగా ఈ సిరీస్‌లో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు జిమ్మీ షేర్ గిల్ వింగ్ కమాండర్ బి.ఎస్. ధనోవా `టోనీ` పాత్రలో నటించగా, సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రలో ప్రాణం పోశారు. కార్గిల్ పర్వతాల మీద తీవ్రమవుతున్న పోరులో `గోల్డెన్ యారోస్` స్క్వాడ్రన్‌కు చెందిన యువ ఫైటర్ పైలట్లు ఎలాంటి ప్రాణాలను పణంగా పెట్టి విధిని నిర్వహించారనేది కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కేవలం యుద్ధ సన్నివేశాలే కాకుండా.. సరిహద్దులో పోరాడుతున్న సైనికుల వెనక ఉండి ధైర్యాన్నిచ్చే కుటుంబాల భావోద్వేగాలను కూడా ఇందులో అద్భుతంగా చూపించారు.
ఈ ప్రాజెక్ట్‌ను మరింత వాస్తవికంగా తీర్చిదిద్దడానికి దర్శకుడు ఓని సేన్ .. అతడి టీమ్ ఎంతగానో శ్రమించారు. భారత వైమానిక దళం మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్. ధనోవా మార్గదర్శకత్వంలో.. నిజమైన ఎయిర్‌ఫోర్స్ బేస్‌లు, అసలు విమానాలు... మిలిటరీ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్ గిల్ పేర్కొన్నట్లుగా... భారత వైమానిక దళం అందించిన గొప్ప సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.
సిద్ధార్థ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలవనున్న ఈ హై-వోల్టేజ్ మిలిటరీ డ్రామా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో అభయ్ వర్మ, దియా మీర్జా, ఆదిల్ హుస్సేన్ తదితర తారాగణం ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేశభక్తి, సైనికుల త్యాగాలు, అసాధారణ సాహసాల సమ్మిళితంగా వస్తున్న ఈ విజువల్ వండర్ సిరీస్ ఆగస్టు 7 నుండి కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.