టాలీవుడ్ కి సింహాచ‌లం..బాలీవుడ్ కి మ‌హాకాలేశ్వ‌ర్!

ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉండటానికి ప్రధాన కారణం ఇక్కడ కొలువైన దేవుడు స్వయంభూ మహాకాళుడు.

Update: 2026-07-21 23:30 GMT

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన శ్రీ మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులకు అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. సినిమా విడుదలలకు ముందు, విజయాలు సాధించిన సందర్భాల్లో .. వ్యక్తిగత కష్టకాలంలో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మొదలుకొని సంగీత దర్శకుల వరకు నిత్యం ఉజ్జయిని బాట పడుతుండటం సర్వ సాధారణమైంది.

ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉండటానికి ప్రధాన కారణం ఇక్కడ కొలువైన దేవుడు స్వయంభూ మహాకాళుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ లింగం దానంతట అదే వెలిసినదిగా భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు సప్త పురాలలో ఒకటైన ఉజ్జయినిలో కాలానికి అధిపతి అయిన శివుడు కొలువై ఉండటం వల్ల భయాలను, అపజయాలను దూరం చేసే శక్తి ఈ క్షేత్రానికి ఉందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ముఖ్యంగా తెల్లవారుజామున జరిగే భస్మ ఆర్తి ఆలయ ప్రధాన ప్రత్యేకత. సజీవ చితాభస్మంతో శివునికి నిర్వహించే ఈ ప్రత్యేక పూజలో పాల్గొనడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. సినీ పరిశ్రమలో నిత్యం ఒత్తిడి, అనిశ్చితి, అభద్రతాభావం మధ్య బతికే సెలబ్రిటీలకు ఈ ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. తమ సినిమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుంటూ వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆలయం చుట్టూ ఉన్న చారిత్రక, తాంత్రిక నేపథ్యం కూడా ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తోంది. భగవంతుని ముందు అందరూ సమానులే అనే భావనతో సెలబ్రిటీలు కూడా సాధారణ భక్తులతో పాటే క్యూలైన్లలో నిలబడి, సాంప్రదాయ దుస్తులు ధరించి పూజల్లో పాల్గొంటున్నారు. మీడియా హడావుడికి దూరంగా తమ మనసులోని కోరికలను దేవునికి నివేదించుకోవడానికి ఈ పవిత్ర క్షేత్రం సరైన వేదికగా సెల‌బ్రిటీలంతా భావిస్తున్నారు.

కెరీర్ పరంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి బాలీవుడ్ ప్రముఖులు మహాకాలేశ్వరుని శరణుజోరుతున్నారు. హోదాను పక్కనపెట్టి పూర్తిగా భక్తిభావంలో లీనమయ్యే వాతావరణం ఇక్కడ లభించడమే ఈ ఆలయం సెలబ్రిటీలకు అంతగా నచ్చడానికి అసలు కారణం. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు ఇలాంటి దేవాల‌యం ఒక‌టి ఉంది. అదే విశాఖ‌ప‌ట్ట‌ణంలో నెల‌కొన్న సింహాచ‌లం. ఇక్క‌డ కొలువుదీరిన అప్ప‌న్న స్వామిని ద‌ర్శించు కోవ‌డానికి సెల‌బ్రిటీలు క్యూ క‌డుతుంటారు. కొత్త సినిమాలు రిలీజ్ కు ముందు...రిలీజ్ త‌ర్వాత స‌క్సెస్ అయిన త‌ర్వాత వ‌చ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. మ‌హాకాలేశ్వ‌ర్ కూడా ఇప్పుడు అలాగే ఫేమ‌స్ అవుతుంది.

Tags:    

Similar News