బాలీవుడ్ లో టైమ్ సెన్స్ ఉండ‌దా?

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ, టైమ్ మేనేజ్‌మెంట్ అత్యంత కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు.

Update: 2026-07-22 01:30 GMT

సౌత్ - నార్త్ సినీ పరిశ్రమల మధ్య పనితీరులో ఉండే వ్యత్యాసాలపై ఓ ప్రముఖ న‌టి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రెండు ఇండస్ట్రీలలోనూ అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవంతో ఆ న‌టి సమయపాలన విషయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకోవాలని కుండబద్దలు కొట్టేశారు. ఇరు పరిశ్రమల పని సంస్కృతిపై తన అనుభవాలను పంచుకున్నారు.

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ, టైమ్ మేనేజ్‌మెంట్ అత్యంత కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. టాలీవుడ్‌లో షూటింగ్స్‌కు షెడ్యూల్స్ ప్రకారం సమయానికి రావడం ఇచ్చిన మాట ప్రకారం పనిచేయడం ముఖ్యమని తెలిపారు. కానీ బాలీవుడ్‌ విషయంలో కాస్త సడలింపు ఉంటుందని, సమయపాలన పాటించడంలో చాలా మంది విఫలమవుతుంటారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద స్టార్స్ సెట్స్‌కు ఆలస్యంగా రావడం వల్ల మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వెల్లడించారు.

కెరీర్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. బాలీవుడ్‌లో ఓ ప్రముఖ స్టార్ హీరో కోసం తాను అత్యధిక సమయం సెట్‌లో వేచి చూడాల్సి వచ్చిందని తెలిపారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేస్తున్న సమయంలో ఆయన రాక కోసం కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. సెట్లో స్టార్ హీరోల కోసం ఇలా గంటల తరబడి ఎదురు చూడటం వల్ల రోజువారీ షెడ్యూల్స్ తలకిందులవుతాయని.. ఇది నటుల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.

కేవలం సమయపాలన లోపం మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ప్రొఫెషనలిజం చాలా వేగంగా ఉంటుందని స‌ద‌రు న‌టి ప్రశంసించారు. తెలుగు, తమిళ దర్శక, నిర్మాతలు ప్లానింగ్‌తో ముందుకు వెళ్తారని, అందుకే అక్కడ సినిమాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయన్నారు. సౌత్ మేకర్స్ పని పట్ల చూపించే అంకితభావం, క్రమశిక్షణ దేశంలోని మిగతా అన్ని ఇండస్ట్రీలకు ఆదర్శమ‌ని కొనియాడారు.

ఒక నటిగా రెండు వైవిధ్యమైన సంస్కృతులు కలిగిన పరిశ్రమల్లో పనిచేయడం ద్వారా తాను ఎంతో నేర్చుకు న్నానని తెలిపారు. ఏ ఇండస్ట్రీలోనైనా ? విజయం సాధించాలంటే నటన ఒక్కటే సరిపోదని.. తోటి కళాకారుల సమయాన్ని గౌరవించడం కూడా ముఖ్యమన్నారు. సమయపాలన అనేది నిబంధన కాదని.. అది తోటివారిపై చూపించే గౌరవానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

స‌ద‌రు న‌టి చేసిన‌ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రమశిక్షణే అక్కడి చిత్రాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పడానికి ఆమె అనుభవాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులోనైనా బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో మార్పు తెచ్చుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News