ఇద్దరు స్టార్స్ 25 ఇయర్స్ స్పెషల్‌గా 'వార్ 2'
ఎన్టీఆర్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ నేపథ్యంలో వార్ 2 భారీగా విడుదల కాబోతుంది, అంతే కాకుండా దేవర సినిమా వసూళ్ల స్థాయిలో వార్ 2 ఓపెనింగ్స్ ఉంటాయని అంతా నమ్మకంగా ఉన్నారు.;
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వార్ 2' సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ మొదటి సారి హిందీలో నటించిన సినిమా కావడంతో వార్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా కావడంతో సహయంగానే బిజినెస్ భారీగా జరుగుతుంది. టీజర్ వచ్చిన తర్వాత కాస్త జోష్ తగ్గింది అన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ బిజినెస్ చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. ఎన్టీఆర్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ నేపథ్యంలో వార్ 2 భారీగా విడుదల కాబోతుంది, అంతే కాకుండా దేవర సినిమా వసూళ్ల స్థాయిలో వార్ 2 ఓపెనింగ్స్ ఉంటాయని అంతా నమ్మకంగా ఉన్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 25న ట్రైలర్‌ను విడుదల చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 25 ఏళ్లు కావస్తోంది. ఇది కాకతాళీయంగా జరిగింది. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. దాంతో ఈ జులై 25న వారి 25 ఇయర్స్ స్పెషల్ ట్రీట్‌గా వార్ 2 ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరి 25 ఏళ్ల జర్నీని వార్ 2 ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
వార్ 2 సినిమా టీజర్‌కి వచ్చిన నెగిటివిటీ కారణంగా ట్రైలర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్టీఆర్‌కి సన్నిహితంగా ఉండే తెలుగు ఫిల్మ్ మేకర్స్ సైతం వార్ 2 సినిమా ట్రైలర్ కట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. జులై 25న భారీ ఎత్తున వార్ 2 ట్రైలర్ లాంచ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులతో పాటు హృతిక్ రోషన్ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం అందుతోంది. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా హీరోయిన్ ఉండదని తెలుస్తోంది. హృతిక్ రోషన్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన విషయం తెల్సిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సితార వంశీ భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. దేవర సినిమాను నిర్మించి విడుదల చేసిన నాగవంశీ ఇప్పుడు వార్ 2 సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ను దాదాపు 550 ప్రివ్యూ షో లు వేయాలని పట్టుదలతో ఉన్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి.