ప్రాధాన్యత లేని పాత్రలో ట్యాలెంటెడ్ నటుడు?
నితీష్ తివారీ పురాణేతిహాస డ్రామా `రామాయణం` నిరంతరం చర్చల్లో నిలుస్తోంది. రామాయణం ఫ్రాంఛైజీని రెండు భాగాలుగా దాదాపు 800కోట్ల బడ్జెట్ తో నిర్మించే ప్రయత్నం చేయడం ఆసక్తిని పెంచుతోంది.;
నితీష్ తివారీ పురాణేతిహాస డ్రామా `రామాయణం` నిరంతరం చర్చల్లో నిలుస్తోంది. రామాయణం ఫ్రాంఛైజీని రెండు భాగాలుగా దాదాపు 800కోట్ల బడ్జెట్ తో నిర్మించే ప్రయత్నం చేయడం ఆసక్తిని పెంచుతోంది. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ యష్ నటిస్తుండగా చాలామంది అగ్ర తారలు కీలక పాత్రలు పోషిస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అంతకంతకు అంచనాలు రెట్టింపయ్యాయి.
ఈ సినిమాకి కాస్టింగ్ ఎంపికలు ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పటికీ నితీష్ ఇందులో ఇతర పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేస్తూనే ఉన్నారు. ఓవైపు చిత్రీకరణ సాగుతున్నా, కీలక పాత్రధారుల ఎంపిక అతడికి తల బొప్పి కట్టిస్తోందని అర్థమవుతోంది. ఇటీవలే శూర్పణఖ పాత్ర కోసం నితీస్ కాజల్ ని సంప్రదించారని కథనాలొచ్చాయి. కానీ అధికారిక ప్రకటన ఏదీ లేదు. తాజా సమాచారం మేరకు.. వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ఓ పాత్రకు ఎంపికయ్యారని ప్రచారం సాగుతోంది. దైత్య వంశానికి చెందిన రాక్షస యువరాజు, శూర్పణఖ భర్త విద్యుత్జిహ్వ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ అంగీకరించారని చెబుతున్నారు.
అయితే శూర్పణఖ భర్త గురించి ప్రజలకు ఎంతవరకూ తెలుసు? రామాయణంలో శూర్పణఖ ఎవరో తెలుసు కానీ ఆమె భర్త ఎవరో ఎవరికీ తెలీదు. సినిమా పరంగా శూర్పణఖ భర్తకు ప్రాధాన్యత ఉందా లేదా? అన్నది కూడా ప్రజలకు అంతగా అవగాహన లేదు. మరి ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రకు ఒబెరాయ్ అంగీకరించడం ఆశ్చర్యపరిచేదే. అతడికి ఇటీవల హిట్లు లేకపోవచ్చు. విలన్ గా లేదా సహాయక పాత్రలు చేసి ఉండొచ్చు. కానీ రామాయణం లాంటి మెగా బడ్జెట్ ప్రాజెక్ట్ లో మరీ అంతగా పట్టింపు లేని పాత్రలో నటించేంతగా దిగజారాడా? అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న. ఒకవేళ నితీష్ రామాయణం కథను రెండు భాగాలు గా తెరకెక్కిస్తున్నాడు గనుక శూర్పణఖ భర్త అయిన రాక్షస రాజు పాత్రను ఎక్స్ టెంట్ చేసి చూపిస్తున్నారా? అన్నది వేచి చూడాలి. అయితే వివేక్ ఒబెరాయ్ ఎంపిక గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనాల లేదు. ఒబెరాయ్ ఇంతకుముందు ఆర్జీవీ `రక్త చరిత్ర`లో నటించాడు. అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. అతడు ఉత్తరాదితో పాటు దక్షిణాదినా పాపులర్ ఫేస్ కాబట్టి అది రామాయణంకి ప్లస్ కావొచ్చు.