తెలుగు హీరోల్ని మునగ చెట్టెక్కిస్తోంది
మొదటి సినిమా చాంపియన్ ప్రచారంలో బిజీగా ఉన్న అనస్వర, ఇప్పటికే తన కెరీర్ రెండో సినిమా అవకాశాన్ని అందుకుంది.;
మాటకారితనం లేకపోతే ఈరోజుల్లో బతకడం కష్టం. చాలా మంది మాలీవుడ్ అమ్మాయిలు టాలీవుడ్ లో ప్రవేశిస్తూ, ఇక్కడ వేసే బిస్కెట్ల గురించి కొందరు కనిపెట్టేస్తుంటారు. నిత్యామీనన్ లా ప్రభాస్ ఎవరో తెలీదు! అని మీడియా ఎదుటే కామెంట్ చేయగలిగే తెలివితక్కువతనం ఈరోజుల్లో ఎవరికీ లేదు.
పిట్ట కొంచెం కూత ఘనం! తరహాలో ఇప్పుడు ఆరంభమే ఎన్నో తెలివితేటలతో పాదం మోపుతున్నారు. ఇదే కేటగిరీకి చెందుతుంది `చాంపియన్స్` బ్యూటీ అనస్వర రాజన్. తాజాగా టాలీవుడ్ కి పరిచయమైన కేరళ కుట్టి అనస్వర రాజన్ తెలివితేటలకు ఫిదా అయిపోని వాళ్లు లేరు. ఈ అమ్మడు తన మాటకారితనంతో అందరినీ ఉత్సాహపరుస్తోంది. ఇంతకీ అనస్వర రాజన్ ఏమని అంటోంది? అంటే..
తనకు అల్లు అర్జున్ తెలుగు హీరో అని తెలియదు! అని వ్యాఖ్యానించింది. ఆయన నటించిన సినిమాలు మలయాళంలోకి అనువాదమై విడుదలవుతుంటే అతడు స్ట్రెయిట్ హీరో అని అనుకున్నానని చెప్పింది. అలాగే మగధీర సినిమా చూసినప్పుడు అది తెలుగు సినిమా అని తనకు తెలియదని కూడా అనేసింది. మొత్తానికి అనస్వర రాజన్ చాలా తెలివిగా స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించేస్తోంది. ఈ ముద్దు ముద్దు మాయ మాటలకు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఏమేరకు పడిపోతారో చూడాలి.
అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అంతటి వాడే అనస్వర రాజన్ అందచందాలు, ప్రతిభను పొగిడేస్తూ, మునుముందు పెద్ద డైరెక్టర్ల నుంచి పెద్ద అవకాశాలొస్తాయని అనేసారు. అందువల్ల ఈ అమ్మడిని తక్కువగా చూడటానికేమీ లేదు. ఈరోజుల్లో ప్రతిభ ఉంటే చాలదు. తనను తాను ప్రమోట్ చేసుకునే తెలివితేటలు, చొరవ, సందర్భోచితంగా మాట్లాడే మేధస్సు ఎవరికైనా ఉండి తీరాలి. అలాంటి ఛామ్, ఇంటెలెక్చువల్ క్వాలిటీ అనస్వర రాజన్ లో ఉన్నాయి. అందువల్ల ఈ భామ కూడా కీర్తి సురేష్, నిత్యామీనన్ లా పెద్ద స్థాయిలో నిరూపించే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 25న చాంపియన్స్ రిలీజవుతోంది. బిగ్ డే కోసం అనస్వర ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తోంది. అయితే మాటల గారడీతో మునగచెట్టెక్కిస్తున్న ఈ అమ్మడికి ముందుగా పిలిచి అవకాశమిచ్చే పెద్ద హీరో ఎవరో వేచి చూడాలి.
తెలుగులో రెండో సినిమా..
మొదటి సినిమా చాంపియన్ ప్రచారంలో బిజీగా ఉన్న అనస్వర, ఇప్పటికే తన కెరీర్ రెండో సినిమా అవకాశాన్ని అందుకుంది. తన తదుపరి తెలుగు సినిమాకు అనస్వర అధికారికంగా సంతకం చేసింది. ఈ చిత్రం యువతను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా ఉంటుందని భావిస్తున్నారు. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన మహేష్ ఉప్పల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. గత వారం తమన్ విడుదల చేసిన ఈ సినిమా మొదటి టీజర్ ఆకట్టుకుంది.