పాపాయికి డైపర్లు మార్చడంలో హీరోగారు బిజీ
విక్కీ కౌశల్ ప్రస్తుతం తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. తండ్రి అయిన ఈ దశలోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తున్నాడు.;
స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విక్కీ కౌశల్. స్టంట్ మాస్టర్ శామ్ కౌశల్ వారసుడిగా సినీపరిశ్రమలో సహాయకపాత్రలతో మొదలైన విక్కీ, అంచెలంచెలుగా ఎదిగి చివరకు హీరో అయ్యాడు. అతడు నేడు భారతదేశంలోని ప్రామిస్సింగ్ స్టార్లలో ఒకడు. చావా ఘనవిజయంతో పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్నాడు. ఇంతకుముందు `యూరి` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. 2025 బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటి అయిన `చావా`లోను నటించాడు. ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ని ఎదురించే హిందూ చక్రవర్తి శంభాజీ మహరాజ్ పాత్రతో మనసులను గెలుచుకున్నాడు.
ఓవైపు `చావా` చిత్రంతో విక్కీ పేరు మార్మోగుతున్న సమయంలోనే అతడు వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్తను అందించాడు. బిడ్డొచ్చే వేళా విశేషం.. అతడికి బాగా కలిసొచ్చింది. కత్రిన తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం విక్కీ తండ్రి పాత్రను ఆస్వాధిస్తున్నంతగా దేనినీ ఆస్వాధించే పరిస్థితిలో లేడు. నటన కంటే తాను ఇప్పుడు డైపర్లు మార్చడంలోనే మెరుగ్గా ఉన్నానని విక్కీ ఛమత్కరించాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
విక్కీ కౌశల్ ప్రస్తుతం తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. తండ్రి అయిన ఈ దశలోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తున్నాడు. తన నవజాత శిశువుకు, భార్యకు కొన్ని గంటల పాటు దూరంగా ఉన్నా కూడా అతనికి ఇంటిపై బెంగ వేస్తోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తండ్రి అయ్యాక ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడాడు. తాను ఇంటికి దూరంగా కొన్ని గంటలు కూడా గడపలేకపోతున్నానని అన్నాడు. ఇటీవల నిజమైన ఆనందాన్ని తాను అనుభవిస్తున్నానని తెలిపాడు. తాను ఇప్పుడు నటన కంటే డైపర్లు మార్చడంలోనే మెరుగ్గా ఉన్నానని ఛమత్కరించాడు. ``తండ్రి అయిన తర్వాత నేను నగరం విడిచి రావడం ఇదే మొదటిసారి. ఇది చాలా కష్టంగా ఉంది. ..కానీ నా బిడ్డ పెద్దయ్యాక ఇది చూసినప్పుడు, తన తండ్రిని చూసి గర్వపడతాడని అనుకుంటున్నాను`` అని అవార్డు స్వీకరించిన విక్కీ అన్నాడు.
ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడం కొత్తగా ఉంది.. ప్రస్తుతం అంతా మాయాజాలంలా ఉంది.. చాలా ఆనందంగా ఉంది... ఆ భావన ఎలా ఉందో నేను మాటల్లో చెప్పలేను అని వీక్కీ అన్నారు. తన కుటుంబం సంతోషంగా ఉందని అవార్డును తన కుటుంబానికి బిడ్డకు అంకితమిచ్చానని ఎమోషనల్‌గా వ్యాఖ్యానించాడు. విక్కీ -కత్రిన జంట 2021లో పెళ్లి చేసుకోగా, 2025 నవంబర్ లో మగ బిడ్డకు స్వాగతం పలికారు. వారు ఇంకా బిడ్డ పేరు.. ముఖాన్ని బహిర్గతం చేయలేదు.