టాలీవుడ్ కొత్త దంప‌తులు!

టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు గట్టిగా మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా టాలీవుడ్ యంగ్ స్టార్లు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.;

Update: 2026-03-16 17:30 GMT

టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు గట్టిగా మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా టాలీవుడ్ యంగ్ స్టార్లు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్ప‌టికే అక్కినేని ఫ్యామిలీ నుంచి నారా లోకేష్ కుటుంబం వరకు, సింగర్స్ నుంచి గ్లోబల్ స్టార్స్ వరకు వరుసగా కొత్త జంటలు కొలువుదీరుతుండటంతో చిత్ర పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. అక్కినేని వారసులు నాగచైతన్య , అఖిల్ ఇద్దరూ తమ జీవిత భాగస్వాములను ఎంచుకుని ఒకే ఏడాదిలో వార్తల్లో నిలిచారు. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జంట తమ క్లాసిక్ లుక్స్‌తో ఆకట్టుకోగా, అఖిల్-జైనబ్ హుస్సేన్ వివాహం కూడా ఎంతో ఘనంగా జరిగింది.

తాజాగా అల్లు శిరీష్ తన చిరకాల స్నేహితురాలు నైనికను వివాహం చేసుకుని అల్లు ఫ్యామిలీలో కొత్త వెలుగులు నింపారు.మోస్ట్ వాంటెడ్ జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎట్టకేలకు తమ బంధాన్ని వివాహం ద్వారా అధికారికం చేసారు. చాలా కాలంగా వీరి ప్రేమపై వస్తున్న రూమర్లకు పెళ్లితో ఫుల్ స్టాప్ పడింది. అలాగే సమంత - ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం కూడా ఈ మ‌ధ్య‌నే నిరాడంబ‌రంగా జ‌రిగింది. వీరిద్దరి కెరీర్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఈ కలయిక అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా ఆసక్తిని కలిగిస్తోంది.

రాజకీయ - సినీ నేపథ్యం ఉన్న నారా రోహిత్ - శిరీషల వివాహం కూడా ఎంతో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన వీరి పెళ్లి వేడుకలో నందమురి-నారా కుటుంబాల సందడి చేసాయి. అలాగే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్య రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. బిగ్ బాస్ విజేతగా రాహుల్ సాధించిన పాపులారిటీతో, ఆయన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. `చిన్నారి పెళ్లికూతురు`గా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అవికా గోర్ తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేశారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ ట్రావెల్ ఫొటోలను షేర్ చేస్తూ అలరించిన ఈ జంట, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కావడం విశేషం.

ఇలా ప్రతి జంటా ఒక ప్రత్యేకమైన కథతో, తమదైన శైలిలో వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం ఈ సీజన్ విశేషం. డెస్టినేషన్ వెడ్డింగ్స్ నుంచి ట్రెడిషనల్ ఈవెంట్స్ వరకు అన్నీ విభిన్నంగా సాగుతున్నాయి. టాలీవుడ్ యంగ్ బ్రిగేడ్ అంతా ఒకేసారి ఇలా వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు తమకు నచ్చిన జీవిత భాగస్వాములతో హ్యాపీగా సెటిల్ అవ్వడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త దంపతులందరికీ టాలీవుడ్ పెద్దలు అభిమానులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని దీవెనలు అందిస్తున్నారు.

Tags:    

Similar News