నిన్న రమ్యకృష్ణ..నేడు శోభన కూడా రెడీ!
సుధీర్ఘ విరామం తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించిన మూవీ `జైలర్`. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా రజనీకాంత్‌కు కమ్ బ్యాక్ మూవీ అయింది.;
వెండితెరపై బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లుగా నిలిచిన జోడీలు మళ్లీ తెరపై అలరించడానికి రెడీ అవుతున్నాయి. హిట్ పెయిర్‌లుగా నిలిచి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాన జోడీలు మళ్లీ కలిసి నటిస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి, అంచనాలు వేరుగా ఉంటాయి. అవి ఆయా ప్రాజెక్ట్‌లకు ప్రధాన బలంగా నిలుస్తుంటాయన్నది తెలిసిందే. అలాంటి కాంబినేషనే ఇటీవల `జైలర్`లో జోడీ కట్టి అందరిని అలరించింది. అదే సూపర్‌స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణల జోడీ.
సూపర్‌స్టార్ రజనీకాంత్. రమ్యకృష్ణ కలయికలో రూపొందిన `పడయప్ప` ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని డామినేట్ చేస్తూ రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి క్యారెక్టర్ ఇప్పటికీ ఆమె కెరీర్‌లో మర్చిపోలేని పాత్రగా నిలిచి తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఆ క్యారెక్టరే రమ్యకృష్ణకు `బాహుబలి`లో రాజమాతగా నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టి పాన్ ఇండియా స్థాయిలో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకునేలా చేసింది. ఈ మూవీ తరువాత వీరిద్దరి కలయిలో మరో సినిమా రాలేదు.
సుధీర్ఘ విరామం తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించిన మూవీ `జైలర్`. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా రజనీకాంత్‌కు కమ్ బ్యాక్ మూవీ అయింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రజనీ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లని సాధించిన సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. మళ్లీ ఇదే తరహా కాంబినేషన్ సెట్టవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం `జైలర్`కు సీక్వెల్‌గా రూపొందుతున్న `జైలర్ 2`లో నటిస్తున్న రజనీ తన 173వ ప్రాజెక్ట్‌కు ఇటీవలే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీలోని కీలక పాత్రలో ప్రముఖ సీనియర్ నటి శోభన కూడా కనిపించనుందని ఇన్ సైడ్ టాక్.
రజనీకాంత్, శోభన కాంబినేషన్‌లో గతంలో మణిరత్నం తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మాస్టర్ పీస్ `దళపతి` రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో రజనీ, శోభన భగ్న ప్రేమికులుగా నటించారు. అంతకు ముందు 1989లో విడుదలైన `శివ` మూవీలోనూ కలిసి నటించారు. `దళపతి` తరువాత వీరిద్దరూ కలిసి మరో సినిమాలో నటించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు 173వ ప్రాజెక్ట్‌లో కలిసి నటించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొంత కాలంగా తమిళ సినిమాలకు దూరంగా ఉంటూ మలయాళ మూవీస్‌లో మాత్రమే నటిస్తూ వస్తున్న శోభన ఇన్నేళ్ల విరామం తరువాత రజనీ కోసం తమిళ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. దీనిక సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.