'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ రివ్యూ

సంజయ్ విశ్వనాథ్ ( సూర్య) పెద్ద బిజినెస్ మ్యాన్. అతను ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన షూటర్ కూడా. చిన్నతనంలో ఎదురైన ఓ అనుభవం వల్ల అతను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు.

Update: 2026-08-14 06:38 GMT

'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ రివ్యూ

నటీనటులు: సూర్య - మామిత బైజు - రాధిక శరత్ కుమార్ - రవీనా టాండన్ - సునీల్ రెడ్డి - హర్ష చెముడు - కాళి వెంకట్ - హైపర్ ఆది తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: నిమిష్ రవి

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య

రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ స్టార్ సూర్య.. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి - తెలుగు నిర్మాత నాగవంశీలతో చేసిన తమిళ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ రోజే తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సంజయ్ విశ్వనాథ్ ( సూర్య) పెద్ద బిజినెస్ మ్యాన్. అతను ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన షూటర్ కూడా. చిన్నతనంలో ఎదురైన ఓ అనుభవం వల్ల అతను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. ఐతే తన కుటుంబానికి వారసుడు కావాలన్న తల్లి కోరికను నెరవేర్చడం కోసం అతను సరోగసీ ద్వారా ఒక కొడుక్కి తండ్రి అవుతాడు. ఐతే కొంత కాలానికి ఆ పిల్లాడు అరుదైన జబ్బు బారిన పడతాడు. బోన్ మారో ట్రాన్స్పాలంట్ చేయాాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ పిల్లాడిని కాపాడేందుకు సంజయ్ కుటుంబంలోకి వచ్చిన మ్యాడీ (మామిత బైజు)కి ఇక్కడ ఎదురైన అనుభవాలేంటి.. సంజయ్ తో ఆమెకు ఏర్పడిన బంధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మొదలైనపుడు సూర్య-మామిత బైజు కాంబినేషన్ అనగానే.. ఇదేదో ‘భగవంత్ కేసరి’ టైపు సినిమా అయ్యుండొచ్చని.. మామితకు ఫాదర్ ఫిగర్ లాంటి పాత్రలో సూర్య కనిపిస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ టీజర్లో సూర్యకు జోడీగానే మామిత నటించిందని.. ఇది వయసు అంతరం ఉన్న ఇద్దరి మధ్య ప్రేమాయణం నేపథ్యంలో నడిచే కథ అని తెలిసినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెంకీ అట్లూరి ఎంచుకున్న ఈ పాయింట్ ఒక స్టార్ హీరో సినిమాల్లో ఊహించలేనిది. ఐతే ఇక్కడి వరకు కొత్తదనం చూపించిన వెంకీ.. మిగతా సినిమాలో చూపించింది సగటు ప్రేమకథ.. ఫ్యామిలీ డ్రామానే. అయినా రెండున్నర గంటలకు పైగా నిడివిలో పెద్దగా బోర్ కొట్టకుండా ఆసక్తికర కథనంతో సినిమాను నడిపించాడు. తెలిసిన సీన్లనే అందంగా తెరపై ప్రెజెంట్ చేయడం ద్వారా అతను ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ను ఎంగేజింగ్ గా మార్చాడు. మధ్యలో కొంత నెమ్మదించినా.. రొటీన్ అనిపించినా.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం వల్ల.. కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. యువ ప్రేక్షకులకు ఇది జస్ట్ ఓకే అనిపిస్తుంది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో మూల కథ కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ.. ఇందులోని ఉపకథలన్నీ ఎన్నో సినిమాల్లో చూసేవే. ముఖ్యంగా హీరో తన సవతి సోదరి పెళ్లికి వెళ్లి అక్కడ అంతా సెటిల్ చేసేసే సీన్లు లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటాం. కానీ తెలిసిన సీన్లనే ఒక పాజిటివ్ ఫీల్ కలిగేలా.. ఎక్కువ నాటకీయత లేకుండా నీట్ గా తీయడం ద్వారా వెంకీ అట్లూరి మార్కులు కొట్టేశాడు. కథ తొలి అరగంట కొంచెం కొత్తగా సాగుతూ.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది. మేకర్స్ చెప్పినట్లే హీరో నేపథ్యం అంతా ‘గజిని’ సినిమాలో సంజయ్ రామస్వామిని పాత్రను గుర్తుకు తెస్తుంది. మామిత బైజుకు వంద శాతం నప్పే అల్లరి పిల్ల పాత్రనే క్రియేట్ చేసి దానికో చిన్న ట్విస్ట్ ఇచ్చి ఆ పాత్రనూ ఇంట్రెస్టింగ్ గా మార్చాడు దర్శకుడు. లీడ్ క్యారెక్టర్స్ రెండూ వేటికవే ప్రత్యేకంగా ఉండడంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆరంభంలోనే ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ చేస్తుంది. ఐతే ప్రధాన పాత్రలు పరిచయం అయ్యాక ఈ కథ ఎలా సాగబోతోందన్నది ప్రేక్షకులకు ముందే ఒక ఐడియా వచ్చేస్తుంది. రాధిక చేసిన హీరో తల్లి పాత్రను సైతం ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దడం.. మరోవైపు మామిత చేసే అల్లరితో ప్రథమార్ధం మంచి వేగంతో నడుస్తుంది. సూర్య కనిపించిన ప్రతిసారీ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటాడు. హీరో హీరోయిన్ల ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ ఆడ్ గా అనిపించకుండా దాన్ని చాలా మెచ్యూర్డ్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు. విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్టాఫ్ యూత్ మెచ్చే కొత్తదనం.. వినోదాన్ని అందించడంతో పాటు.. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పర్ఫెక్ట్ బ్లెండ్ అనిపిస్తుంది.

హీరో ఒక టీవీ షోలో ఒక తండ్రి గొప్పదనాన్ని చాటిచెప్పే క్రమంలో వచ్చే ఒక ఎపిసోడ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మున్ముందు ఎలాంటి ఫీలింగ్ ఇవ్వబోతోందనడానికి ఒక సంకేతంలా అనిపిస్తుంది. హీరో పాత్ర ఔన్నత్యాన్ని చాటే ఎపిసోడ్ ఇది. కానీ అలాంటి ఎపిసోడ్లు సినిమాలో ఇంకో మూణ్నాలుగు పడ్డాయి. కానీ అవి ఒక.దశ దాటాక ఓవర్ డోస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఊటీలో వచ్చే పెళ్లి ఎపిసోడ్ దగ్గర్నుంచి సినిమా ఒక టెంప్లేట్లో సాగిపోతుంది. హీరోయిన్ ప్రేమను హీరో తిరస్కరించాక ఈ కథ ఎలా సాగుతుందో అనే క్యూరియాసిటి ఏర్పడగా.. ఆ ట్రాక్ ఒక దశ తర్వాత పక్కకు వెళ్ళిపోయి హీరో తన చెల్లి పెళ్ళిలో తలెత్తిన సమస్యలను పరిష్కరించే క్రమంలో రొటీన్ బాట పడుతుంది. సమస్యలు సృష్టించిన రౌడీని కొట్టడం.. కుటుంబ సభ్యుల్ని కలపడం.. ఇలాంటి సీన్లు ఎన్నో సినిమాల్లో చూసినవే. మామిత క్యారెక్టర్ని పూర్తిగా పక్కన పడేయడం నిరాశ పరుస్తుంది. ముగింపులో మాత్రం మళ్ళీ ఆ పాత్రను బాగా వాడుకున్నారు. సూర్య - మామిత పతాక సన్నివేశాలను నిలబెట్టారు. ఆఖర్లో భావోద్వేగాలను.. వినోదాన్ని మేళవించిన తీరు ఆకట్టుకుంటుంది. మొత్తంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్' క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా సాగుతుంది. యువ ప్రేక్షకులకు ఈ స్లో ఫ్యామిలీ డ్రామా కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఇవ్వొచ్చు.

నటీనటులు:

వేసవిలో వీరభద్రుడిగా హాట్ హాట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సూర్య.. ఇప్పుడు వర్షా కాలంలో సీజన్ కు తగ్గట్లే కూల్ పెర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించాడు. పాత్రకు తగ్గట్లు ఎలా అడాప్ట్ చేసుకుంటాడో ఆయన మరోసారి చూపించాడు. వయసుకు తగ్గట్లు పరిణతితో.. క్యారెక్టర్ని అనుసరించి సటిల్ గా నటించాడు సూర్య. కొన్ని సన్నివేశాల్లో కళ్లతో సూర్య పలికించిన హావభావాలు అమితంగా ఆకట్టుకుంటాయి. తెలుగు డైలాగుల మీద సూర్య పెట్టిన శ్రద్ధ కూడా మెప్పిస్తుంది. మ్యాడీ పాత్రలో మామిత బైజు కూడా చక్కగా నటించింది. ఆమెకిది టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అల్లరి సన్నివేశాల్లో సరదాగా నటించడంతో పాటు సీరియస్ సీన్లలో కూడా ఆమె ఆకట్టుకుంది. రాధిక శరత్ కుమార్ తల్లి పాత్రకు నిండుదనం తీసుకొచ్చారు. కథలో సూర్య. మామితలతో సమానంగా ఆమెది కీలక పాత్ర. తల్లి క్యారెక్టర్ కదా అని ఎక్కువ సెంటిమెంట్ దట్టించకుండా సరదాగా ఆ పాత్రను తీర్చిదిద్దడంతో ఆమె కూడా అందుకు తగ్గట్లే చలాకీగా నటించారు. రవీనా టాండన్ పాత్ర కూడా కథలో కీలకమే. ఆమె కూడా బాగా చేసింది. సునీల్ రెడ్డి వినోదాన్ని పంచాడు. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

'విశ్వనాథ్ అండ్ సన్స్' కు సాంకేతిక హంగులన్నీ బాగా కుదిరాయి. జి.వి.ప్రకాష్ కుమార్ పాటల కంటే నేపథ్య సంగీతంతో ఎక్కువ ఆకట్టుకున్నాడు. ప్లెజంట్ గా సాగే స్కోర్ సన్నివేశాల్లో ఫీల్ పెంచింది. నిమిష్ రవి విజువల్స్ చాలా బాగున్నాయి. సితార వారి ప్రొడక్షన్ వాల్యూస్ కి ఢోకా లేదు. సినిమా చాలా రిచ్ గా తీశారు. వెంకీ అట్లూరి రచయితగా.. దర్శకుడిగా మెప్పించాడు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీద అతను సినిమాను నడిపించాడు. అతను ప్లెజెంట్ మూమెంట్స్ చుట్టూ కథాకథనాలను అల్లుకున్న తీరు.. వాటిని తెరపై ప్రెజెంట్ చేసిన వైనం బాగుంది. అతను డైలాగ్ రైటర్ గానూ ఆకట్టుకున్నాడు. "మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఆ గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక" లాంటి హృద్యమైన సంభాషణలతో పాటు యూత్ మెచ్చే ఫన్నీ డైలాగ్స్ కూడా రాశాడు వెంకీ. సెకండాఫ్ లో వెంకీ రైటింగ్.. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త కసరత్తు చెయ్యాల్సింది.

చివరగా: విశ్వనాథ్ అండ్ సన్స్.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా

రేటింగ్ - 2.75/5

Tags:    

Similar News