టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో కన్నప్ప ప్రీక్వెల్
ఈ ఓపెనింగ్స్ విష్ణుకు కెరీర్లోనే హయ్యెస్ట్ నెంబర్. భక్తి నేపథ్యంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసింది;
మంచు విష్ణు ఎంతో కాలంగా తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పి ఊరిస్తోన్న కన్నప్ప సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. కన్నప్పకు డే1 సుమారు రూ.16 కోట్ల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ ఓపెనింగ్స్ విష్ణుకు కెరీర్లోనే హయ్యెస్ట్ నెంబర్. భక్తి నేపథ్యంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
కన్నప్ప సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందంతో పొంగి పోతున్న విష్ణు తన ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి మీడియా ముందుకొచ్చి కన్నప్పను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే కన్నప్ప భారీ సక్సెస్ మీట్ ను నిర్వహిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు నెక్ట్స్ మూవీ ఏంటనే విషయంపై కూడా ఆయన మాట్లాడారు.
ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కన్నప్పకు సీక్వెల్ ఉండదని, కన్నప్ప స్టాండలోన్ ఫిల్మ్ గా రూపొందిందని చెప్పిన విష్ణు, ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా షేర్ చేశారు. కన్నప్ప సినిమా చూశాక టాలీవుడ్ లోని ప్రెజెంట్ జెనరేషన్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు తనకు ఫోన్ చేసి కన్నప్పకు ప్రీక్వెల్ చేస్తారా అని అడిగారని విష్ణు వెల్లడించారు.
ముందు ఆ విషయం విని నవ్వుకున్నానని చెప్పిన విష్ణు, కన్నప్పకు సీక్వెల్ ఉండదు కాబట్టి ఉంటే ప్రీక్వెలే ఉంటుందని, ఆ ప్రీక్వెల్ లో తిన్నడు లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? కన్నప్పగా మారడానికి ముందు అతని జీవితం ఎలా ఉంటుందనే విషయాలపై తీయొచ్చని, ఒకవేళ స్క్రిప్ట్ సహకరిస్తే కన్నప్పకు ప్రీక్వెల్ చేసే అవకాశాలు లేకపోలేదని విష్ణు హింట్ ఇచ్చారు. ఇదే సక్సెస్ మీట్‌లో విష్ణు మరికొన్ని విషయాలను కూడా మొహమాటం లేకుండా చెప్పారు. ప్రస్తుతం తనకున్న ఫేమ్ కు కన్నప్ప స్క్రిప్ట్ తో తెలుగు డైరెక్టర్ల దగ్గరకు వెళ్తే ఏ స్టార్ డైరెక్టరూ కన్నప్పను తనతో తీసేవాళ్లు కాదని, అందుకే బాలీవుడ్ నుంచి మహాభారతం లాంటి గొప్ప సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ కు ఆ బాధ్యతలు అప్పగించామని క్లారిటీ ఇచ్చారు విష్ణు.
దాంతో పాటూ కన్నప్ప సినిమాకు ఇంత భారీ ఓపెనింగ్స్ రావడానికి తన ఫ్రెండ్ ప్రభాసే కారణమని, ఈ విషయాన్ని ఒప్పుకోవడంలో తనకెలాంటి ఈగోలు లేవని చెప్పి అందరి దృష్టిలో విష్ణు మరో మెట్టు ఎక్కేశారు. అయితే కన్నప్ప సినిమా నిలబడటానికి రీజన్ ఆ సినిమాలో క్యామియోలు చేసిన పలువురు స్టార్లదే అయినప్పటికీ కన్నప్ప వెయిట్ మొత్తాన్ని భుజాలపై మోసిన విష్ణు కష్టం కూడా అందులో చాలానే ఉందనే విషయాన్ని అందరూ గ్రహించాలి. కన్నప్ప చూసి మనోజ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయిన విషయం గురించి మీడియా విష్ణు ముందు ప్రస్తావించగా, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని విష్ణు చెప్పారు. మొత్తానికి కన్నప్ప సినిమా విష్ణు కెరీర్ ను చాలా పెద్ద మలుపే తిప్పింది. విష్ణు చెప్పినట్టే "ఈ శుక్రవారం నాది" అనే మాటను నిలబెట్టుకున్నారు. కన్నప్పకు ప్రీక్వెల్ చేసినా చేయకపోయినా ఈ సినిమా తన కెరీర్ కు నెక్ట్స్ డోర్స్ ఓపెన్ అయ్యేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.