సింగీతం 61వ సినిమా.. రాజమౌళి ఏమన్నారో తెలుసా?
లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గురించి పరిచయం అవసరం లేదు. నేడు పాన్ ఇండియన్ డైరెక్టర్లు అని చెప్పుకునే చాలా మందికి ఆయన ఒక స్ఫూర్తి.;
లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గురించి పరిచయం అవసరం లేదు. నేడు పాన్ ఇండియన్ డైరెక్టర్లు అని చెప్పుకునే చాలా మందికి ఆయన ఒక స్ఫూర్తి. టాకీ యుగంలో కూడా మూకీ తీసి మెప్పించిన గ్రేట్ డైరెక్టర్. మాటల్లేకుండా సినిమా తీసి, అందులో కామెడీ ఎమోషన్స్ పండించిన ఘనాపాటి. కమల్ హాసన్ `పుష్పక విమానం` సినిమాతో దీనిని సాధ్యం చేసి చూపించినది సింగీతం.
అంతగా సాంకేతికత లేని రోజుల్లోనే `అపూర్వ సహోదరులు` సినిమా తీసారు. ఆ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం, కథానాయకుడిని మరుగుజ్జుగా చూపించి తనలోని టెక్నిక్ ని ప్రపంచానికి ఆవిష్కరించారు. మైఖేల్ మదన కామ రాజు పేరుతో కమల్ హాసన్ ని నాలుగు పాత్రల్లో చూపించిన ఘనత కూడా ఆయనకే చెందుతుంది. ఆదిత్య 369 లాంటి టైమ్ ట్రావెల్ సినిమాని తెరకెక్కించి ఔరా! అనిపించారు. తెలుగు తెరపై తొలి టైమ్ ట్రావెల్ సినిమా ఇది. ఎన్బీకే కెరీర్ బెస్ట్ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఎన్బీకేతోనే భైరవద్వీపం లాంటి జానపద కథను ఎంచుకుని చేసిన ఫాంటసీ ప్రయోగం గురించి చెప్పాల్సిన పని లేదు. అందమైన చందమామ కథను రాసుకుని అద్భుతంగా తెరపై చెప్పగల మేధావి ఆయన.
సింగీతం దర్శకత్వం వహించిన క్లాసిక్స్ అన్నిటినీ కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ చూసినా ఫ్రెష్ గా అనిపిస్తాయి. అలాంటి ప్రయోగాత్మక కథల్ని, టైమ్ లెస్ మాస్టర్ పీస్ సినిమాలను ఎంచుకుని దర్శకుడిగా గొప్ప అభిరుచిని ప్రదర్శించారు. అందుకే భారతీయ సినిమా లెజెండరీ దర్శకులలో ఒకరిగా ఆయన పేరు సుస్థిరమైంది.
అయితే ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనలో స్ఫూర్తిని నింపిన గొప్ప దర్శకుడిగా సింగీతం పేరును ప్రస్థావించడం ఆయన రేంజుకు సింబాలిక్. నేటి తరంలో అద్భుతమైన విజువల్ వండర్స్ ని తెరకెక్కిస్తూ, సాంకేతికంగా మరో లెవల్ అంటే ఏమిటో చూపించిన దిగ్గజ దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి పేరు మార్మోగుతోంది. భారతదేశంలోని గొప్ప పాన్ ఇండియన్ దర్శకులలో అతడు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. అంత గొప్ప దర్శకుడు స్వయంగా తనకు సింగీతం శ్రీనివాసరావు స్ఫూర్తి నిచ్చారని చెప్పడం అతిశయోక్తిగా లేదు. నిజానికి రాజమౌళి లాంటి దర్శకులకు సాంకేతికంగా స్ఫూర్తిని నింపేంత గొప్ప చరిత్ర సింగీతానికి ఉంది. రాజమౌళి తన సినిమాల్లో చేసే విజువల్ వండర్స్, వినూత్నమైన ప్రయోగాలు అప్పట్లోనే సింగీతం చేసి చూపించారు.
ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్ 61వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. SSR61 వర్కింగ్ టైటిల్. ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కల్కి 2898 AD లాంటి భారీ విజయాన్ని అందించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించడం ఆసక్తిని కలిగిస్తోంది. నాగ్ అశ్విన్ కూడా సింగీతంకి పెద్ద అభిమాని.
వయసు ఒక నంబర్ మాత్రమే.. మనసుండాలే కానీ..! 90 ఏళ్లు దాటినా మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని కెమెరా వెనక్కి రావడం అనేది సినిమాపై సింగీతంకి ఉన్న అపారమైన ప్రేమను చూపిస్తుంది. అందుకే రాజమౌళి అంతగా ఎగ్జైట్ అయ్యారు. జక్కన్న అభినందనలు తెలపడంతో ఇప్పుడు ఈ కొత్త సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. లెజెండరీ సింగీతం మళ్ళీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఆశిద్దాం.