2027.. హవా మొత్తం టాలీవుడ్‌దే!
స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో కలిసి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలు 2027లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.;
2025లో ఎన్నో భారీ సినిమాలొచ్చి అందులో పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవగా, పలు సినిమాలు అనుకున్న ఫలితాల్ని సాధించలేకపోయాయి. ఈ ఏడాదిలో కూడా పలు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక రానున్న సంవత్సరంలో అయితే వరల్డ్ సినిమా వద్ద తెలుగు సినిమా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో కలిసి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలు 2027లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్
2027లో తెలుగు సినిమా యొక్క స్థాయి, మార్కెట్.. ప్రపంచ స్థాయిలో విపరీతంగా పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. నెక్ట్స్ ఇయర్ లో పలు భారీ సినిమాలు రిలీజ్ కానుండగా, అందులో మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి ఒకటి. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచమే వెయిట్ చేస్తోంది. తెలుగు సినిమా స్థాయిని ఇప్పటికే ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి, ఇప్పుడు వారణాసితో తన గత సినిమాల రికార్డులను చెరిపేయాలని చూస్తున్నారు. వారణాసితో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరుగుతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కానుంది.
2027లోనే స్పిరిట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ కూడా వచ్చే సంవత్సరంలోనే రిలీజ్ కాబోతుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సందీప్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా మారారు. అలాంటి సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో స్పిరిట్ రికార్డులు సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు.
భారీ క్రేజ్ తో రూపొందుతున్న అల్లుఅర్జున్- అట్లీ సినిమా
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కాబోతుంది. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో అల్లు అర్జున్ కు ఇప్పటికే దేశమంతటా మంచి క్రేజ్ ఏర్పడగా, అట్లీకి కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి డిమాండే ఉంది. అలాంటి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరిస్తుందని ఆడియన్స్ ఆశిస్తున్నారు.
వీటితో పాటూ ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి కూడా వచ్చే ఏడాది ఓ సినిమా వచ్చే అవకాశముంది. పుష్ప సిరీస్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుకుమార్ ఈ సినిమాను దర్శకత్వం చేయనున్నారు. ఇప్పటికీ వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం మంచి హిట్ అవడంతో పాటూ చరణ్, సుకుమార్ ఇద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉండటంతో ఈ ప్రాజెక్టు కూడా వరల్డ్ సినిమా వద్ద భారీగా పెర్ఫార్మ్ చేస్తుందని భావిస్తున్నారు. పైన చెప్పిన సినిమాలన్నీ అనుకున్న స్థాయి అంచనాలను అందుకుంటే 2027 టాలీవుడ్ కు చాలా మెమొరబుల్ ఇయర్ గా మారడం ఖాయం.