టాలీవుడ్ లో ఎందుకిలా? ఫ్యాన్స్ ఆందోళన

టాలీవుడ్‌ లో రిలీజ్ డేట్ల హడావుడి ఎక్కువే.. కానీ సినిమాలు మాత్రం థియేటర్లకు రావడం లేదు! ఒకప్పుడు పెద్ద సినిమాల విడుదలలతో కళకళలాడే మార్చి– ఏప్రిల్ సీజన్ ఈసారి మాత్రం ఖాళీ క్యాలెండర్‌ లా మారిపోయింది.;

Update: 2026-01-31 18:30 GMT

టాలీవుడ్‌ లో రిలీజ్ డేట్ల హడావుడి ఎక్కువే.. కానీ సినిమాలు మాత్రం థియేటర్లకు రావడం లేదు! ఒకప్పుడు పెద్ద సినిమాల విడుదలలతో కళకళలాడే మార్చి– ఏప్రిల్ సీజన్ ఈసారి మాత్రం ఖాళీ క్యాలెండర్‌ లా మారిపోయింది. వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్న నిర్మాతలు, ఆ తర్వాత వాటిని వాయిదా వేస్తూ అభిమానులను నిరాశపరుస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి చూస్తే డేట్లు ఉన్నాయి.. రిలీజ్‌ లు లేవు అన్నట్టుగా మారింది.

ఇటీవల రెండు క్రేజీ ప్రాజెక్టులు మార్చి చివరి వారంలో విడుదల చేస్తామని గ్రాండ్ గా ప్రకటించాయి. వాటిలో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న పెద్ది, మరొకటి నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్. ఆ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్లు, అప్డేట్లు, ప్రీ-రిలీజ్ బజ్‌ తో అభిమానులు సినిమాల కోసం రెడీ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహానికి బ్రేక్ పడింది!

ముందుగా ప్యారడైజ్ విషయానికి వస్తే.. ఆ సినిమా ప్రీ- ప్రొడక్షన్ పనులే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భారీ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. కథ, సెట్స్, టెక్నికల్ వర్క్ విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్తుండటంతో షూటింగ్ ఆలస్యమైంది. ఇంకా సెకండ్ ఆఫ్ షూటింగ్ పూర్తికాకపోవడంతో మార్చి రిలీజ్ అసాధ్యమైంది. దీంతో చిత్రబృందం కొత్త తేదీ కోసం ఆలోచిస్తోంది.

ఇక పెద్ది పరిస్థితి కూడా భిన్నంగా లేదు. షూటింగ్ షెడ్యూల్స్ మారడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో ఆ చిత్రం కూడా వాయిదా దిశగా వెళ్లినట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, మార్చి రిలీజ్ కష్టమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కచ్చితంగా రిలీజ్ అవుతుందనుకుంటే.. ఇప్పుడు దాదాపు వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇలా వరుస సినిమాలు వాయిదా పడుతుండటంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.

పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. చిన్న సినిమాలు వస్తున్నా, ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. దీంతో బాక్సాఫీస్ దెబ్బతింటోంది. మరోవైపు స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం కావడం ఫ్యాన్స్‌ కు కూడా నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన డేట్లపై నమ్మకం తగ్గుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ముందుగా పనులు పూర్తి చేసి తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టాలీవుడ్‌ లో ప్రస్తుతం రిలీజ్ డేట్లకే ప్రాధాన్యం పెరిగింది గానీ, అసలు సినిమాలు మాత్రం సమయానికి రావడం లేదు. పెద్ది, ప్యారడైజ్ వాయిదాలతో మార్చి సీజన్ వెలితిగా మారింది. ఇక కొత్త తేదీలతో ఆ చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి. .

Tags:    

Similar News