వారణాసి రిలీజ్ డేట్‌.. ఎందుకీ డిస్కషన్?

అయితే తాజాగా ప్రకటించిన వారణాసి రిలీజ్ డేట్ విషయంలో మాత్రం రాజమౌళి అన్ని పరిస్థితులను ముందుగా అంచనా వేయలేదా? అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.;

Update: 2026-01-31 15:30 GMT

టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ రాజమౌళి సినిమా అంటే సాధారణంగా ప్రతి అడుగూ లెక్కగట్టి వేస్తారనే పేరు ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలతో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్లానింగ్‌ కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తాజాగా ప్రకటించిన వారణాసి రిలీజ్ డేట్ విషయంలో మాత్రం రాజమౌళి అన్ని పరిస్థితులను ముందుగా అంచనా వేయలేదా? అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసిను 2027 ఏప్రిల్ 7న విడుదల చేస్తామని టీమ్ అధికారికంగా ప్రకటించింది. వారణాసిలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి సైలెంట్‌గా డేట్ అనౌన్స్ చేయడం అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. పోస్టర్, రిలీజ్ డేట్ రెండూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే అదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. 2027 వేసవి సీజన్‌లో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు షెడ్యూల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ లు, హాలీవుడ్ చిత్రాల పోటీ, సెలవుల సీజన్‌ లో థియేటర్ల కోసం తీవ్ర పోటీ ఉండే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో అంత భారీ బడ్జెట్ సినిమా కోసం సరైన స్క్రీన్ కౌంట్ దక్కుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

మరోవైపు రాజమౌళి సినిమాల నిర్మాణం సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. షూటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కలిసి సంవత్సరాల తరబడి సాగుతాయి. గత చిత్రాల అనుభవం చూస్తే రిలీజ్ డేట్లు మారిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈసారి ప్రకటించిన తేదీకి నిజంగానే సినిమా పూర్తి అవుతుందా? లేక మళ్లీ వాయిదా పడుతుందా? అనే చర్చ కూడా వినిపిస్తోంది.

ఇంకా మహేష్ బాబు ఇమేజ్, పాన్ ఇండియా మార్కెట్, విదేశీ బిజినెస్ అన్నీ దృష్టిలో పెట్టుకుంటే సరైన టైమింగ్ చాలా కీలకం. ఒక చిన్న పొరపాటు కూడా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే రాజమౌళి లాంటి దర్శకుడు అన్ని సమస్యలు, ఇబ్బందులు చూసే ఉంటారు. కానీ ఈసారి తొందరగా డేట్ ఫిక్స్ చేశారా? అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

అయితే అభిమానుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. రాజమౌళి ప్లానింగ్‌ పై సందేహం అవసరం లేదని, ఆయన నిర్ణయం వెనుక కచ్చితంగా స్ట్రాటజీ ఉంటుందని అంటున్నారు. భారీ స్థాయిలో ప్రీ- రిలీజ్ బిజినెస్, అంతర్జాతీయ మార్కెట్ టార్గెట్ చేస్తూ ముందుగానే డేట్ లాక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే చర్చలు మొదలయ్యాయి. ఇది రాజమౌళి మాస్టర్ ప్లానా? లేక రిస్కీ నిర్ణయమా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం.. వారణాసిపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. రిలీజ్ వరకు హైప్ మరింత పెరగడం ఖాయం.

Tags:    

Similar News