ల్యాండ్ మార్క్ మూవీ.. టాలీవుడ్ కింగ్ 'టార్గెట్' అదేనా?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోలో హీరోగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమే అయింది.;
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోలో హీరోగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమే అయింది. రీసెంట్ గా వచ్చిన కూలీ, కుబేర వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ లేదా సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితమైన నాగ్ నుంచి ఓ సాలిడ్ కమర్షియల్ మూవీ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ వేచి చూసే రోజులకు ఎండ్ కార్డ్ పడినట్టే కనిపిస్తుంది.
కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను నాగార్జున సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకెళ్లారు. కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్వయంగా నాగార్జున గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
గతేడాది ఎలాంటి హడావుడి లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేకర్స్, అప్పటి నుంచి సీక్రెట్ గా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు పోస్టర్ గానీ, కాన్సెప్ట్ వీడియో గానీ విడుదల చేయకపోవడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టాకీ పార్ట్ దాదాపు పూర్తి దశకు చేరుకున్నట్టు సమాచారం.
షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా సీక్రెట్ గా ఉంచాలన్నది నాగార్జున ప్లాన్. అందుకే మేకర్స్ ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. అయితే సమ్మర్ చివరికి చిత్రీకరణ పూర్తి చేసి, దసరా టార్గెట్ గా గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సరైన సమయానికి రిలీజ్ డేట్ ప్రకటించేలా నాగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. టైటిల్ కూడా అప్పుడే అనౌన్స్ చేయనున్నారని సమాచారం.
అయితే లాటరీ కింగ్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అదే సమయంలో చిత్రంలో నాగార్జునకు జోడీగా టబు నటించనున్నట్టు ఇటీవల ఆయన కన్ఫర్మ్ చేశారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండనున్నట్లు సమాచారం. నాట్యం ఫేమ్ సుస్మితా భట్ మరో హీరోయిన్ గా ఎంపికైనట్టు ప్రచారం సాగుతోంది.
కథ ఆధారంగా నాగ్ మూడు వేర్వేరు గెటప్స్‌లో కనిపిస్తారని, మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్. జోనర్ విషయానికి వస్తే యాక్షన్, ఎమోషన్స్ ఉన్న కథతో సినిమా రూపొందుతోందట. ఈసారి గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ లకు దూరంగా రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రేక్షకులు నిజమైన స్టంట్స్ ను ఇష్టపడుతున్నారని భావించిన నాగ్, అదే స్టైల్ లో మూవీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సంథింగ్ స్పెషల్ గా కింగ్ 100 ఉండబోతుందని వినికిడి.