అల్లు వారి పెళ్లి సందడి.. దుబాయ్ పార్టీతో పీక్స్!
అల్లు వారి పెళ్లి సందడి ఇప్పుడు పీక్స్‌కి చేరుకుంది! అల్లు శిరీష్- నైనిక జంట పెళ్లికి మార్చి 6న ముహూర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే.;
అల్లు వారి పెళ్లి సందడి ఇప్పుడు పీక్స్‌కి చేరుకుంది! అల్లు శిరీష్- నైనిక జంట పెళ్లికి మార్చి 6న ముహూర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే నెలరోజుల ముందే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా శిరీష్ - నైనిక జంట తమ స్నేహితుల కోసం దుబాయ్ లో గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట కూడా అటెండయిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్‌గా మారుతున్నాయి.
అయితే పెళ్లికి వెన్యూ ఎక్కడ? అన్నదానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో దుబాయ్ బ్యాచిలర్ పార్టీ నుంచి కొన్ని ఫోటోలు మాత్రం లీకయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా దుబాయ్‌లోని ఒక లగ్జరీ యాచ్‌పై శిరీష్ షాంపేన్ బాటిల్ తో ఛీరప్ చేసిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక బన్ని - స్నేహ జంట ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా మారారు. బ్రదర్స్ ఇద్దరూ పార్టీలో తలమునకలయ్యారు. ఒకరితో ఒకరు కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
వెన్యూ ఎక్కడ? సినీ పరిశ్రమకు పార్టీ ఉంటుందా? అంటే.. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అల్లు వారే చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి వేదిక గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఇది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగవచ్చని ప్రచారం సాగుతోంది. బహుశా రాజస్థాన్ లేదా విదేశాల్లో ఈ పెళ్లి వేడుక జరిగేందుకు ఆస్కారం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి.
అలాగే శిరీష్ పెళ్లి డెస్టినేషన్ తరహాలో జరిగితే కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే దీనికి అటెండయ్యే అవకాశం ఉంది. తిరిగి హైదరాబాద్ లో పార్టీ నిర్వహిస్తే, సినీరాజకీయ రంగాలకు చెందిన మిత్రులందరినీ అల్లు అరవింద్ ఫ్యామిలీ ఆహ్వానించే అవకాశం ఉంది.
గత ఏడాది అక్టోబర్‌లో శిరీష్- నైనిక జంట నిశ్చితార్థం అయింది. ఈ నిశ్చితార్థంలో మెగాస్టార్ చిరంజీవి సహా మెగా కుటుంబ సభ్యులు సందడి చేసారు. పెళ్లి వేడుకలకు కూడా మెగా హీరోలంతా హాజరయ్యేందుకు అవకాశం ఉంది. ఇక శిరీష్ కి నైనిక ఎలా పరిచయం అయ్యారు? అంటే... హీరో నితిన్ భార్య షాలిని ద్వారా ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం అయ్యారని తెలుస్తోంది. రెండేళ్ల పాటు డేటింగ్ తర్వాత ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒకటవుతున్నారు.