చరణ్ నుంచి మరో మాస్ ట్రీట్!
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నారు.;
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్నారు. ఉప్పెన మూవీతో మొదటి అవకాశంతోనే డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
షూటింగ్ దశలో పెద్ది
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నారు. ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ పెద్ది నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ తో పాటూ, చికిరి సాంగ్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో మూవీపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
పెద్ది తర్వాత సుకుమార్ తో చరణ్ సినిమా
ఓ వైపు పెద్ది సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే చరణ్ మరోవైపు తన తర్వాతి సినిమాపై ఫోకస్ చేశారు. పెద్ది తర్వాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 17వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే.
చరణ్ కోసం రెండు కథలు సిద్ధం
రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై మంచి బజ్ ఉంది. ఇదిలా ఉంటే పుష్ప2 తర్వాత నుంచి చరణ్ సినిమాపైనే కసరత్తులు చేస్తున్న సుకుమార్ మెగా పవర్ స్టార్ కోసం రెండు కథల్ని రెడీ చేశారని తెలుస్తోంది. తన రెగ్యులర్ స్టైల్ కు తగ్గట్టు ఓ క్లాస్ కథతో పాటూ, రంగస్థలం లాంటి ఓ మాస్ కథను కూడా రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది.
మాస్ కే ఓటేసిన చరణ్
ఈ రెండింటిలో రామ్ చరణ్ మాస్ సినిమాకు ఓటు వేశాడని అంటున్నారు. అదే నిజమైతే రామ్ చరణ్ నుంచి మరో మాస్ ట్రీట్ రావడం ఖాయం. పుష్ప2 తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని అతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సుకుమార్ కథతో పాటూ చరణ్ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఈ ఇయర్ సమ్మర్ నుంచి సినిమాను మొదలుపెట్టి, వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.