41 గంట‌లు నిర్విరామంగా షూటింగ్ లోనే కీర్తి సురేష్‌!

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌ని గంట‌ల వివాదం ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

Update: 2026-08-04 17:30 GMT

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌ని గంట‌ల వివాదం ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. సెట్ లో 8 గంట‌లు మించి ప‌ని చేయించుకోవ‌డంపై చాలా మంది హీరోయిన్లు బాహాటంగా విమ‌ర్శ‌లు చేసారు. ప‌నికి త‌గ్గ పారితోషికం ఇవ్వ‌డం లేద‌ని..అలాంట‌ప్ప‌డు ఎందుకు? ప‌ని చేయాలని మ‌రికొంత మంది న‌టీమ‌ణులు తెర‌పైకి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో తాజాగా కీర్తి సురేష్ ఏకంగా 41 గంట‌ల పాటు నిర్విరామంగా ప‌నిచేసి ప‌ని త‌న‌కు భారం కాద‌ని నిరూపించారు. వివ‌రాల్లోకి వెళ్తే..ఒకే సమయంలో పలు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల తాను పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవలి కాలంలో విభిన్న భాషల్లో ప్రాజెక్ట్‌లను అంగీకరిస్తున్న కీర్తి సురేష్ డేట్స్ సర్దుబాటు చేయడం కోసం ఎంతగా శ్రమించాల్సి వస్తుందో వివరించారు. ముఖ్యంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ షూటింగ్ నుండి నేరుగా మరో సినిమా సెట్స్‌కు పరిగెత్తాల్సిన పరిస్థితుల్లో విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో ఏకంగా 41 గంటలపాటు ఎలాంటి నిద్ర లేకుండా మెలకువగానే ఉంటూ షూటింగ్‌లలో పాల్గొన్నానని సంచలన నిజం బయటపెట్టారు. చాలా సంద‌ర్భాల్లో సెట్ లో 12 గంట‌ల‌కు మించి ప‌నిచేసిన సంద‌ర్భాలున్నాయ‌న్నారు.

సినిమా పరిశ్రమ బయట నుంచి చూసే వారికి గ్లామర్‌గా కనిపిస్తుందని కానీ తెర వెనుక నటీనటులు పడే శ్రమ, పడే మానసిక , శారీరక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నిరంతరం ప్రయాణాలు చేస్తూ రాత్రింబవళ్లు తేడా లేకుండా పనిచేయడం వల్ల ఒక్కోసారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని తెలిపారు. అయినప్పటికీ వృత్తిపై ఉన్న అంకితభావంతోనే ఇన్ని కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నట్లు కీర్తి పేర్కొన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ .. ఇతర ఇండస్ట్రీలలో నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం 8 గంటల పని గంటల నిబంధనను తీసుకురావాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సినీ ప్రముఖులు భిన్న వాదనలు వినిపిస్తున్న వేళ కీర్తి సురేష్ అనుభవం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవర్ టైమ్ పని చేయడం వల్ల కలిగే అలసట నటీనటుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చర్చకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ఎన్నో అద్భుతమైన పాత్రలతో జాతీయ స్థాయి అవార్డులను అందుకున్న నటిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కీర్తి సురేష్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతటి కఠినమైన శ్రమను దాటివచ్చారో? ఈ ఉదంతం తెలియజేస్తోంది. విజయాలు మాత్రమే కాకుండా వెనుక నటీనటులు పడే త్యాగాలు కూడా ఎక్కువేనని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సినిమా రంగంలో పని గంటల సంస్కరణలు .. నటీనటుల పనితీరుపై జరుగుతున్న చర్చల మధ్య కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమ వర్కింగ్ అవర్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? నటీనటుల ఆరోగ్య భద్రతకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News