పవన్, విజయ్.. నాని ట్వీట్ వైరల్!

సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా అందరూ తక్కువ అంచనా వేసిన వ్యక్తి గెలిస్తే వచ్చే కిక్కే వేరు.;

Update: 2026-05-04 08:30 GMT

సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా అందరూ తక్కువ అంచనా వేసిన వ్యక్తి గెలిస్తే వచ్చే కిక్కే వేరు. సరిగ్గా ఇలాంటి సీన్ ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడులో కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా రెండు పెద్ద పార్టీల మధ్యే సాగుతున్న పాలిటిక్స్ లోకి ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చి, అందరి లెక్కలు మార్చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దళపతి విజయ్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ ను ఏ స్థాయిలో మొదలుపెట్టారో ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది.

విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళగ వెట్రి కళగం పార్టీ ఎన్నికల బరిలోకి దిగిన మొదటిసారే రికార్డు స్థాయి ఓట్లను కొల్లగొడుతోంది. అధికార డీఎంకే కోటను బద్దలు కొడుతూ విజయ్ పార్టీ ఏకంగా 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండటం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నీలాంకరైలోని విజయ్ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయ్ ఇంటి వైపు వెళ్లే దారుల్లో ఇతర వాహనాల రాకపోకలను కూడా నియంత్రిస్తున్నారు.

తమిళనాడులో జరుగుతున్న ఈ పరిణామాలపై టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "మొదట అందరూ అనుమానించారు.. కానీ ఇప్పుడు కిరీటం దక్కబోతోంది" అంటూ నాని తన ఎక్స్‌ ఖాతాలో విజయ్‌కు అభినందనలు తెలిపారు. గతంలో మన దగ్గర (ఏపీలో పవన్ కల్యాణ్ గెలుపును ఉద్దేశిస్తూ) ఇలాగే జరిగిందని, ఇప్పుడు మన పొరుగు రాష్ట్రంలోనూ అదే రిపీట్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఒక అండర్ డాగ్ గెలవడం అనేది పక్కా సినిమాటిక్ గా ఉంటుందని, దీన్ని 'అబ్సల్యూట్ పాలిటిక్స్' అనవచ్చని నాని సరదాగా ట్వీట్ చేశారు.

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మొత్తం 234 స్థానాల్లో టీవీకే 109 సీట్ల వద్ద ఆధిక్యంలో ఉంది. గతంలో 159 స్థానాల్లో ఉన్న డీఎంకే ఇప్పుడు కేవలం 61 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. మెజారిటీ మార్కుకు విజయ్ పార్టీ చాలా దగ్గరగా ఉండటంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. రాజకీయంగా విజయ్ సాధిస్తున్న ఈ సక్సెస్, మే 8న విడుదల కాబోతున్న ఆయన ఆఖరి చిత్రం 'జననాయగన్' పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా లీక్ వ్యవహారంతో వార్తల్లో ఉన్నా, తాజా ఫలితాలు దానికి పెద్ద బూస్ట్‌లా మారాయి.

ఏదేమైనా తమిళ రాజకీయం ఒక కొత్త మలుపు తీసుకుంది. సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పి మరీ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నిర్ణయం సరైనదేనని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత విజయ్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. నాని లాంటి స్టార్ హీరోలు కూడా విజయ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే, సినిమా బాషలు దాటి విజయ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళ ప్రజలు తమ తీర్పును క్లియర్ గా చెప్పేశారని, వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నట్లు నాని తన ట్వీట్ ముగించారు.

Tags:    

Similar News