పైర‌సీలో సినిమా వీక్ష‌ణ‌.. చట్టాల వైఫల్యమా? నైతిక విలువల లోపమా?!

తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం `జన నాయగన్` విడుదలకు ముందే లీక్ అవ్వడం, ఆ కాపీని ఏకంగా 1.2 కోట్ల మంది వీక్షించడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Update: 2026-07-04 01:25 GMT

తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం `జన నాయగన్` విడుదలకు ముందే లీక్ అవ్వడం, ఆ కాపీని ఏకంగా 1.2 కోట్ల మంది వీక్షించడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒక అగ్ర హీరో, పైగా రాష్ట్ర ముఖ్యామంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సినిమాకే డిజిటల్ భద్రత కరువైందంటే.. ఇక సామాన్య నిర్మాతల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైబర్ క్రైమ్ విభాగాలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, సాంకేతికతను వాడుకుని ఇలాంటి భారీ పైరసీ నెట్‌వర్క్‌లు యథేచ్ఛగా సాగడం చట్టాల వైఫల్యమా లేక ఉచితంగా కంటెంట్ చూడాలనుకునే ప్రేక్షకుల నైతిక విలువల లోపమా అనే చర్చ ఇండస్ట్రీలో వేడి పెంచుతోంది. చట్టాలు ఎన్ని ఉన్నా, లోపలి వ్యక్తులే (ఇన్‌సైడర్స్) నమ్మకద్రోహానికి పాల్పడుతుండటం డిజిటల్ సెక్యూరిటీలోని అతిపెద్ద లోపాన్ని ఎత్తిచూపుతోంది.

అయితే ఇలాంటి లీకేజీల నడుమ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన చరిత్ర మన చిత్ర పరిశ్రమకు ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన `అత్తారింటికి దారేది` సినిమా విడుదల కంటే ముందే సగం భాగం ఆన్‌లైన్‌లో లీకైంది. చాలా మంది ఆ కాపీని చూసేసినా థియేటర్లలోకి వచ్చాక ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయి రికార్డులను తిరగరాసింది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన `టాక్సీవాలా` చిత్రాన్ని కూడా విడుదలకు ముందే పూర్తి సినిమాను ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. నెగెటివిటీని దాటుకుని థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించి ఘన విజయం సాధించింది. కంటెంట్‌లో దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ఈ చిత్రాలు నిరూపించాయి.

అదే తీరుగా... ఇప్పుడు కోటి మందికి పైగా జనం రిలీజ్‌కు ముందే చూసేసినా.. దళపతి విజయ్ `జన నాయగన్` చిత్రం కూడా థియేటర్లలో పెద్ద విజయం సాధించడానికి ఆస్కారం ఉందా అనే ప్ర‌శ్న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ అంతమంది చూసేసిన తర్వాత కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే అది కచ్చితంగా ఒక మిరాకిల్ (అద్భుతం) అనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే... 1.2 కోట్ల మంది అనేది ఒక సినిమా థియేట్రికల్ రన్‌ను శాసించగల భారీ సంఖ్య. మరోవైపు.. ఈ ఆన్‌లైన్ లీకేజీకి కారణమైన సైబర్ నేరగాళ్లపై .. దీని వెనుక ఉన్న అంతర్గత నెట్‌వర్క్‌పై ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ లీక్ వివాదం ఒకవైపు ఉంటే..`జన నాయగన్` సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) తో కూడా తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. లీక్ వివాదం, సెన్సార్ ఇబ్బందుల నడుమ ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేకపోయారు. ఒక భారీ బడ్జెట్ సినిమా విడుదలకు ముందే ఇలా ఘోరంగా పైరసీకి గురికావడం... మరోవైపు సెన్సార్ అడ్డంకులు ఎదురుకావడం సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బని, ఇది ఇండస్ట్రీ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని సినీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

`జన నాయగన్` లీకేజీ కేసులో మొత్తం 21 మంది నిందితులు ఉండగా... ఎడిటింగ్ సూట్ నుండి హార్డ్ డ్రైవ్ ద్వారా ఫుటేజీని బిట్లు బిట్లుగా దొంగిలించి త‌ర్వాత దానిని పూర్తి నిడివి చిత్రంగా మార్చి `తమిళ రాకర్స్` వంటి సైట్లలో అప్‌లోడ్ చేసినట్లు తేలడంతో నిందితులైన ఎస్. రజినీ, జయప్రకాష్ స‌హా ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ర‌జినీ - జ‌య‌ప్ర‌కాష్ ల‌ బెయిల్ పిటిషన్లను జస్టిస్ సి. కుమారప్పన్ కొట్టివేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ కోర్టు ద్వారా లింకులను బ్లాక్ చేయించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా.. మరోవైపు ఈపాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదాల వల్ల ఇంకా క్లియరెన్స్ రాక వాయిదా పడుతూ వస్తోంది. ఇలా ఒక భారీ బడ్జెట్ సినిమా విడుదలకు ముందే కోట్లాది ముందు పైర‌సీ కాపీలో చూసేయ‌డం సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైర‌సీలో సినిమాని వీక్షించాల‌నే ప్ర‌జ‌ల‌ అనైతిక విలువ‌ల్ని కూడా కొంద‌రు నిల‌దీస్తున్నారు.

Tags:    

Similar News