ఏ ట్యూన్ చేస్తానో నాకే తెలియదు.. బొమ్మరిల్లు మ్యూజిక్‌పై DSP ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు సినీ సంగీతంలో కొన్ని ట్యూన్లు సినిమా పూర్తైన తర్వాత కూడా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో అలాగే నిలిచిపోతాయి

Update: 2026-08-19 14:30 GMT

తెలుగు సినీ సంగీతంలో కొన్ని ట్యూన్లు సినిమా పూర్తైన తర్వాత కూడా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో అలాగే నిలిచిపోతాయి. సినిమా పేరు వినగానే ఆ మ్యూజిక్ గుర్తొచ్చేంతగా వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అలాంటి మ్యూజిక్ అనుభూతినే బొమ్మరిల్లు సినిమాకు అందించారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్రసాద్. ఆ సిగ్నేచర్ మ్యూజిక్ వెనుక ఉన్న కథను రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో దేవీ శ్రీ ప్ర‌సాద్ వెల్ల‌డించారు.

బొమ్మ‌రిల్లు సినిమా కథను డైరెక్ట‌ర్ భాస్కర్ తనకు చెప్పే టైమ్‌లోనే ఓ ఆలోచన వచ్చిందని, సినిమాలో ఓ సీన్ లో హీరో హీరోయిన్ తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయని చెప్పిన సందర్భంలోనే.. ఆ సీన్‌కు స్పెష‌ల్ మ్యూజిక్ ఉండాలని డైరెక్ట‌ర్‌తో చెప్పినట్లు వెల్లడించారు. అంతేకాదు, అదే మ్యూజిక్‌ను తర్వాత వచ్చే మరో రెండు మూడు సీన్స్ లోనూ వాడి, చివరకు ఓ పాటను కూడా అదే మ్యూజిక్‌తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని సూచించాన‌ని, అలా ఆ ట్యూన్‌ను సినిమా మొత్తానికి సిగ్నేచర్ మ్యూజిక్‌గా మార్చాలనే ఆలోచన క‌థ విన‌గానే వ‌చ్చింద‌ని చెప్పారు.

అయితే ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ విష‌య‌ముంది. డైరెక్ట‌ర్ కు ఈ ఐడియా చెప్పిన టైమ్ లో డీఎస్పీ దగ్గర అసలు ట్యూన్ లేద‌ట‌. పైగా ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నానో తనకే తెలియదని ఆయన చెప్పడం విశేషం. ముందుగా మ్యూజిక్ ఎలా ఉండాలో ఒక విజన్ మాత్రమే ఉంద‌ని, దానికి సరైన ట్యూన్ మాత్రం తర్వాతే పుట్టింద‌ని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది.

ఇక్కడే డైరెక్ట‌ర్ భాస్కర్ విజన్, డీఎస్పీ మ్యూజికల్ ఇన్‌స్టింక్ట్ కలిసి పనిచేశాయి. కథలోని ఆ సీన్ ఇచ్చిన ఫీల్‌ను పట్టుకుని డీఎస్పీ రూపొందించిన మ్యూజిక్ తర్వాత సినిమాలో పలు సందర్భాల్లో వినిపించింది. చివరకు అదే ట్యూన్ ప్రేక్షకులకు సినిమా గుర్తింపుగా మారింది. ముఖ్యంగా తాను ఊహించిన దానికంటే ఆ మ్యూజిక్‌కు మరింత మంచి రీచ్ వచ్చిందని డీఎస్పీ చెప్ప‌డం గ‌మ‌నార్హం. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన బొమ్మరిల్లు సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించగా.. సినిమాలోని పాటలన్నీ అప్పట్లో చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు DSP చెప్పిన ఈ విషయాలతో ఆ సినిమా మ్యూజిక్ వెనుక ఉన్న క్రియేటివ్ ప్రాసెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News