రామ్ గొప్ప మనసు.. అప్పుడు నేరుగా.. ఇప్పుడు వీడియో కాల్ ద్వారా!
ముఖ్యంగా తమ జీవితంలో ఒక్కసారి అయినా సరే తమ అభిమాన హీరోని కలవాలి అని , మాట్లాడాలని కోరుకునే వారు కూడా లేకపోలేదు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు, అభిమానుల కోరికలను తీర్చడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు అనడంలో సందేహం లేదు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఎంతో మంది అభిమానుల కోరికలను తీరుస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా వారు తిరిగి ఆరోగ్యవంతులుగా అవ్వడానికి అవసరమైన ఖర్చు మొత్తం తామే భరిస్తామంటూ భరోసా ఇస్తూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి తారలు సెలబ్రిటీలకు అండగా ఆర్థికంగా నిలబడుతూ ఆశ్చర్యపరుస్తుంటే.. ఇప్పుడు ఈ జాబితాలోకి రామ్ పోతినేని కూడా వచ్చి చేరారు.
లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అత్యధికంగా కలిగి ఉన్న హీరోలలో ఒకరిగా పేరు సంపాదించుకున్న రామ్ కి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎంతో మంది లేడీ అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు. ముఖ్యంగా తమ జీవితంలో ఒక్కసారి అయినా సరే తమ అభిమాన హీరోని కలవాలి అని , మాట్లాడాలని కోరుకునే వారు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ఒక చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మంచానికే పరిమితమై రామ్ పోతినేనిని కలవాలి అని, అతడితో మాట్లాడాలని ఎంతో కాలంగా పరితపిస్తోందట . ఈ విషయం కాస్త ఆయన వరకు చేరడంతో ఆయన ఏకంగా వీడియో కాల్ ద్వారా ఆ చిన్నారితో మాట్లాడి ఆమెకు భరోసా ఇస్తూ ఆర్థికంగా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శశి భవ్యత అనే అమ్మాయి లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. తరచూ ఫిట్స్ రావడం, నాడీ వ్యవస్థ దెబ్బ తినడంతో మంచానికే పరిమితమైన ఈ 18 ఏళ్ల అమ్మాయికి టాలీవుడ్ హీరో రామ్ అంటే ఎంతో అభిమానం. మతిస్థిమితం కూడా సరిగ్గా లేని ఈ అమ్మాయికి రామ్ పేరు చెబితే చాలు ఒంట్లో ఎక్కలేని ఉత్సాహం వస్తోంది. ముఖ్యంగా శశి భవ్యత తల్లిదండ్రులు ఈమెకు రామ్ వీడియోలు , ఫోటోలు చూపించి అన్నం తినిపించి, మందులు వేస్తున్నారట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది కాస్తా రామ్ వరకు చేరి వెంటనే ఆయన స్పందించారు.
శశి భవ్యత తో వీడియో కాల్ లో మాట్లాడిన రామ్ ఆమె తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పాడ. అవసరమైన మందులు, ఇతర ఖర్చులు అన్నీ ఇకపై తానే భరిస్తానని, ఆమె రిపోర్టులు అన్నీ కూడా తనకు అందాయని, మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని ఆర్థికంగా కూడా భరోసా ఇచ్చారు రామ్. ఇకపోతే గత రెండు నెలల క్రితం మరో అభిమానిని ఏకంగా ఇంటికి వెళ్లి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె కూడా ఇలా నరాల బలహీనతతో బాధపడుతూ వీల్ చైర్ కే పరిమితం అవడంతో ఆమెను కలిసిన రామ్ ఆమెతో మాట్లాడి ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు గడిపినట్లు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.. ఏది ఏమైనా రామ్ గొప్పతనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.