టాప్ స్టోరి: హాలీవుడ్ మాఫియా వర్సెస్ బాలీవుడ్ మాఫియా
హాలీవుడ్ దిగ్గజ నటుడు ఫ్రాంక్ సినాత్రా జీవితంలోనూ ఇలాంటి మాఫియా బెదిరింపుల ఉదంతాలు అనేకం ఉన్నాయి.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ సహా పలువురు ప్రముఖులను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న పరిణామాలు చూస్తుంటే.. చరిత్ర పునరావృతమవుతోందన్న భావన కలుగుతుంది. సరిగ్గా ఇదే తరహాలో ఒకానొక కాలంలో హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను కూడా మాఫియా, గ్యాంగ్‌స్టర్లు... వ్యవస్థీకృత నేర ముఠాలు తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. స్టార్ హీరోలను, గాయకులను టార్గెట్ చేస్తూ ప్రాణహాని కలిగించిన ఘటనలు హాలీవుడ్ చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. సినిమా గ్లామర్ ప్రపంచానికి.. అండర్ వరల్డ్ డాన్‌ల అహంకారానికి మధ్య సాగే ఈ పోరాటం ఎప్పుడూ అత్యంత ప్రమాదకరమైనదేనని నాటి సంఘటనలు నిరూపిస్తున్నాయి.
హాలీవుడ్ దిగ్గజ నటుడు ఫ్రాంక్ సినాత్రా జీవితంలోనూ ఇలాంటి మాఫియా బెదిరింపుల ఉదంతాలు అనేకం ఉన్నాయి. షికాగో ఆర్గనైజ్డ్ క్రైమ్ బాస్ `సామ్ జియాంకానా`తో సినాత్రాకు ఉన్న సంబంధాలు ఒక దశలో ఆయనకే శాపంగా మారాయి. మాఫియా కోరిన కాంట్రాక్టులకు, క్యాసినో డీల్స్‌కు సినాత్రా అంగీకరించకపోవడంతో ఆ ముఠాలు ఆయనను తీవ్రంగా బెదిరించాయి. దీనికి పరాకాష్టగా 1963లో ఆయన కుమారుడు ఫ్రాంక్ సినాత్రా జూనియర్‌ను దుండగులు కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో కప్పం డిమాండ్ చేశారు. సినాత్రా డబ్బు చెల్లించి కుమారుడిని విడిపించుకున్నా కానీ.. అండర్ వరల్డ్ చేతుల్లో ప్రముఖులు ఎలా బందీలుగా మారతారనేదానికి ఇది సజీవ సాక్ష్యంగా నిలిచింది.
అలాగే ఆర్జీవీ మనసును కకావికలం చేసిన ప్రపంచ ప్రఖ్యాత చిత్రం `ది గాడ్‌ఫాదర్` షూటింగ్ సమయంలో లెజెండరీ నటుడు మార్లన్ బ్రాండో నిజమైన మాఫియా నుంచి ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొన్నారు. న్యూయార్క్‌కు చెందిన ఐదు మాఫియా కుటుంబాలకు అధిపతిగా ఉన్న జో కొలంబో నేతృత్వంలోని లీగ్.. ఆ సినిమా తమ కమ్యూనిటీని చెడుగా చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా షూటింగ్ ఆపాలని.. లేదంటే నటులను హతమారుస్తామని మాఫియా బాంబు బెదిరింపులకు పాల్పడింది. చివరకు నిర్మాతలు మాఫియా నాయకులతో రహస్య చర్చలు జరిపి.. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు.. రాజీలు కుదుర్చుకున్న తర్వాతే మార్లన్ బ్రాండో ప్రాణభయం లేకుండా షూటింగ్ పూర్తి చేయగలిగారు.
మరోవైపు హాలీవుడ్ యాక్షన్ స్టార్ క్లింట్ ఈస్ట్‌వుడ్ కూడా తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఆర్గనైజ్డ్ నేర ముఠాల నుంచి కిడ్నాప్ - హత్యా బెదిరింపులను ఎదుర్కొన్నారు. 1970ల ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్లు ఆయన్ను కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో వసూలు చేయడానికి ప్లాన్ చేయగా ఎఫ్‌బిఐ ముందే అప్రమత్తమై ఈస్ట్‌వుడ్‌ను కాపాడింది. అయినప్పటికీ ఆయన తన భద్రత కోసం నివాసంలోనూ, షూటింగ్ స్పాట్‌లలోనూ ఆయుధాలు ధరించిన ప్రైవేట్ గార్డులను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. మిక్కీ రూనీ వంటి నటులు కూడా మాఫియా `హఫ్తా` డిమాండ్లకు భయపడి గ్యాంగ్‌స్టర్ల చేతుల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
ఇక సంగీత రంగానికి వస్తే.. హిప్-హాప్ దిగ్గజాలు టుపాక్ షాకూర్ - ది నోటోరియస్ బీ.ఐ.జీ ఉదంతాలు మాఫియా గ్యాంగ్ వార్స్ ఎంతటి రక్తపాతానికి దారితీస్తాయో కళ్లకు కడుతాయి. అమెరికాలో ఈస్ట్ కోస్ట్ వర్సెస్ వెస్ట్ కోస్ట్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఈ ఇద్దరు మహాగాయకులు డ్రైవ్-బై షూటింగ్‌లలో దారుణ హత్యకు గురయ్యారు. నిరంతరం బెదిరింపులు ఎదుర్కొన్న వీరు చివరికి అండర్ వరల్డ్ కక్షలకు బలికావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. మరో ప్రముఖ నటి మార్లిన్ మన్రో మృతి వెనుక కూడా నాటి రాజకీయ నాయకులకు, మాఫియాకు ఉన్న సంబంధాలే కారణమనే బలమైన అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి మర్లిన్ మన్రో జీవితం, హత్యోదంతం ఒక సినిమా కథనే తలపిస్తుంది. దీని గురించి తర్వాత చర్చిద్దాం.
మొత్తంగా చూస్తే.. సల్మాన్ ఖాన్ - టైగర్ ష్రాఫ్‌లపై జరుగుతున్న దాడులు.. సెలబ్రిటీలపై బెదిరింపులు కేవలం వ్యక్తిగత కక్షలలా కనిపించకపోయినా.. ఇవి స్టార్ హీరో సల్మాన్‌కు, పవర్ ఫుల్ మాఫియా సిండికేట్‌కు మధ్య జరిగే సుదీర్ఘ ఈగో యుద్ధంగానే చరిత్ర పునరావృతం అవుతోందని చెప్పవచ్చు.