ది ప్యారడైజ్.. ఇప్పుడైనా టైమ్‌ను వాడుకున్నారా?
రిలీజ్‌కు ముందు టైమ్ సరిపోలేదని ట్రైలర్ కూడా వదలకుండా నేరుగా థియేటర్లలోకి వచ్చేసిన 'ది ప్యారడైజ్' టీమ్‌కు ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురవుతోంది.
రిలీజ్‌కు ముందు టైమ్ సరిపోలేదని ట్రైలర్ కూడా వదలకుండా నేరుగా థియేటర్లలోకి వచ్చేసిన 'ది ప్యారడైజ్' టీమ్‌కు ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. రేపు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్ మొదలుకానుంది. అయితే ఈసారి టైమ్ లేదనే కారణం చెప్పే పరిస్థితి లేదు. థియేట్రికల్ రిలీజ్ నుంచి ఓటీటీ వరకు మంచి గ్యాప్ దొరికింది. మరి అప్పట్లో ఆడియన్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్‌ను మేకర్స్ ఎంతవరకు సరిచేశారనేదే అసలు పాయింట్.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ఎదురైంది. ముఖ్యంగా కొన్ని సీన్ల మధ్య సింక్ లేదని, ఎడిటింగ్ సరిగ్గా కుదరలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమాలో కీలకమైన సన్నివేశాలు మిస్సయ్యాయనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. మొదటి అరగంట, ఇంటర్వెల్ లాంటి ఎపిసోడ్స్ మెప్పించినా సెకండాఫ్‌లో కథ నడిచిన విధానం చాలామందికి నచ్చలేదు.
ఇక రిలీజ్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన ఇంటర్వ్యూలు మరో ఆసక్తికరమైన విషయం బయటపెట్టాయి. కొన్ని సీన్ల వెనకున్న అర్థాన్ని, పాత్రల ప్రవర్తనకు కారణాలను వివరించారు. అవి విన్న తర్వాత సినిమాలో ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. దర్శకుడు అనుకున్న డెప్త్ ఆడియన్స్‌కు తెరపై పూర్తిగా చేరలేదనే విషయం ఇక్కడే బయటపడింది. ముఖ్యంగా ఎడిటింగ్‌లో ఎగిరిపోయిన సీన్ల ప్రస్తావన వచ్చింది.
అందుకే ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి ఉంది. థియేటర్లలో తీసేసిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తిరిగి జోడించి ఉంటే కథలో మిస్సయిన కనెక్టివిటీ కొంతవరకు రావచ్చు. పాత్రల మధ్య ఎమోషన్ కూడా మరింత బలంగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. అయితే నెట్‌ఫ్లిక్స్‌కు ఇచ్చిన వెర్షన్లో అలాంటి మార్పులు చేశారా లేదా అనే క్లారిటీ రావల్సి ఉంది. రేపటి స్ట్రీమింగ్‌తో ఈ విషయం తేలిపోనుంది.
అయితే 'ది ప్యారడైజ్' అసలు బిగ్ స్క్రీన్ కోసం తీసిన సినిమా. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, రఫ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థియేటర్లలోనే అనుభవించాలి. అలాంటి సినిమాను ఇంట్లో టీవీ లేదా మొబైల్లో చూసినప్పుడు అదే ఇంపాక్ట్ వస్తుందా అనేది మరో ప్రశ్న. పైగా నిడివి ఎక్కువగా అనిపించిన సన్నివేశాలను ఓటీటీ ఆడియన్స్ స్కిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
నాని కెరీర్లో ఇప్పటికే వరుస విజయాలతో మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ 'దసరా' తర్వాత శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన రెండో సినిమా కావడంతో ఈ ఓటీటీ రెస్పాన్స్ దర్శకుడికి మరింత కీలకం. కథలో తాను అనుకున్న విషయాలు ఆడియన్స్‌కు చేరలేదనే విమర్శలకు ఎక్స్టెండెడ్ కట్‌తో సమాధానం ఇవ్వగలిగితే ఆయనకు ఉపయోగపడొచ్చు. అయితే విడుదలయ్యే వెర్షన్ థియేటర్లలో చూసినదే అయితే, అప్పట్లో మిస్సయిన సీన్లకు సంబంధించిన ప్రశ్నలు మళ్లీ ఎదురయ్యే అవకాశముంది.