క‌న్నీరు పెట్టిస్తున్న న‌టి మ‌ర‌ణం..నెల‌ల పాప ఉండ‌గానే!

పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌తో గతంలో ప్రేమలో ఉండి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియన్ మోడల్ సహారా రే (34) అకస్మాత్తుగా కన్నుమూశారు.

Update: 2026-10-21 07:46 GMT

పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌తో గతంలో ప్రేమలో ఉండి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియన్ మోడల్ సహారా రే (34) అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు ధృవీకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుటుంబ సభ్యులు ఆమె చెంతనే ఉన్న సమయంలో సహారా తుది శ్వాస విడిచారు. అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించలేదు.

ఈ విషాదం మరింత కలచివేసే అంశం ఏమిటంటే? సహారా రే కొన్ని నెలల క్రితమే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జనవరిలో స‌హారా `స్నో` అనే పండంటి పాప పుట్టింది. తల్లిగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించి ఆ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే చిన్న వయసులోనే కన్నుమూయడం అభిమానులను.. ఫ్యాషన్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరణానికి ముందు సహారా రే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2024 ఏప్రిల్‌లో ఆమెకు `గిల్లాన్-బారే సిండ్రోమ్` అనే అరుదైన నాడీ వ్యవస్థ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. శరీర రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడం వల్ల వచ్చే ఈ వ్యాధి కారణంగా కొంతకాలం పాటు పాక్షికంగా పక్షవాతానికి గురై నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునేందుకు ఆమె ఎంతో పోరాటం చేశారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సహారా రే గతంలో తాను డెలివరీకి వెళ్లే ముందు పడిన ఆందోళనను, ఆ తర్వాత పాపతో గడిపిన తీపి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుమార్తె `స్నో`తో ఉన్న వీడియోను.. జూలైలో షేర్ చేసిన చివరి పోస్ట్‌లో `నా సర్వస్వం నా బేబీ స్నో` అంటూ రాసుకొచ్చిన పిక్స్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సర్ఫర్ టోనీ రే కుమార్తె అయిన సహారా రే 2016లో జస్టిన్ బీబర్‌తో కలిసి హవాయిలో విహారయాత్రలో కనిపించడంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో మ్యూజిషియన్ మోడ్ సన్‌తో కూడా ఆమె వార్తల్లో నిలిచారు.

సహారా రే అకాల మరణంతో కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. మోడలింగ్ రంగానికి చెందిన ప్రముఖులు.. స్నేహితులు ..అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పసిపాప `స్నో`కు .. ఆమె కుటుంబానికి కష్ట సమయంలో దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News