బాలీవుడ్ రామాయణ.. తెలుగు మార్కెట్‌కు ముగ్గురి బలం!

బాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ అందుకోవాలంటే బడ్జెట్ మాత్రమే సరిపోదు.

Update: 2026-10-21 06:53 GMT

బాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ అందుకోవాలంటే బడ్జెట్ మాత్రమే సరిపోదు. మన ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే విషయం కూడా ఉండాలి. అలాగే దానికి తగ్గట్టుగా ప్లాన్ కూడా ఉండాలి. నవంబర్ 5న విడుదలవుతున్న 'రామాయణ' విషయంలో మేకర్స్‌కు ఈ అడ్వాంటేజ్ గట్టిగానే ఉంది. రణబీర్ కపూర్ హీరో అయినా, ఈ సినిమాలో యష్, సాయిపల్లవి ఉండటం తెలుగు మార్కెట్‌కు కలిసొచ్చే అంశం.

పైగా లేటెస్ట్ గా విడుదలైన 'రావణ తాండవం' వీడియోతో సౌత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం మరింత పెరిగింది. రణబీర్ కపూర్‌కు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'యానిమల్'తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రాముడిగా పూర్తిగా భిన్నమైన పాత్ర చేస్తున్నారు. అయితే హిందీ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రావాలంటే లోకల్ ప్రమోషన్స్ కూడా ముఖ్యం. అందుకే ఈసారి స్టార్ కాస్టింగ్ మేకర్స్‌కు పెద్ద ప్లస్‌గా మారింది.

ముఖ్యంగా యష్ రావణుడిగా నటించడం కన్నడతో పాటు తెలుగు మార్కెట్‌లోనూ ఉపయోగపడొచ్చు. 'కేజీఎఫ్' రెండు భాగాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత యష్‌ను ఇలాంటి భారీ పాత్రలో చూడాలనే ఆసక్తి ఉంది. ఇప్పుడు 'రావణ తాండవం'లో చూపించిన గెటప్, మాస్ ప్రెజెంటేషన్ ఆ క్రేజ్‌ను మరోసారి గుర్తుచేస్తున్నాయి. పైగా ఈ సినిమాకు యష్ సహనిర్మాత కూడా కావడం విశేషం.

ఇక సాయిపల్లవి విషయంలో పరిస్థితి మరోలా ఉంది. 'ఫిదా', 'లవ్ స్టోరీ', 'తండేల్'లాంటి సినిమాలతో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆమె బాగా దగ్గరయ్యారు. గ్లామర్ కంటే నటనతో పేరు తెచ్చుకున్న సాయిపల్లవి సీత పాత్రకు ఎంపికవడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. రణబీర్, యష్ స్టార్ ఇమేజ్‌కు ఆమెకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ బలం తోడవుతోంది.

దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో 'రామాయణ' డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ రిలీజ్ తీసుకుంది. భారీ సినిమాలకు సరైన థియేటర్లు దక్కేలా ప్లాన్ చేయడంలో ఈ సంస్థకు అనుభవం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో రిలీజ్‌ను ఎంత భారీగా ప్లాన్ చేస్తారనేది కీలకం. కేవలం హిందీ వెర్షన్‌పైనే కాకుండా తెలుగు వెర్షన్‌కూ మంచి రీచ్ తీసుకురావాల్సి ఉంటుంది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. తొలి భాగం నవంబర్ 5న ఐమాక్స్ సహా పలు ఫార్మాట్లలో విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం మరో హైలెట్. రణబీర్‌కు హిందీ మార్కెట్, యష్‌కు కన్నడతో పాటు తెలుగు క్రేజ్, సాయిపల్లవికి సౌత్‌లో ఉన్న గుర్తింపు కలిసివస్తుండగా, కేరళలో ఏవీఏ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది.

Tags:    

Similar News