మాఫియా వ‌ర్సెస్ స్టార్ హీరో ఆట‌లో ఎంత‌మంది పోతారో తెలీదు!

సృష్టిలో జరిగే మెజారిటీ పోరాటాలు, శత్రుత్వాల వెనుక కనిపించని `ఈగో` (Ego) ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Update: 2026-10-21 09:30 GMT

సృష్టిలో జరిగే మెజారిటీ పోరాటాలు, శత్రుత్వాల వెనుక కనిపించని `ఈగో` (Ego) ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ వ‌ర్సెస్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య సాగుతున్న దశాబ్దాల నాటి సుదీర్ఘ పోరు దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఒక గ్యాంగ్‌స్టర్‌కి నేను తలవంచడం ఏంటి.. లొంగిపోవడం ఏంటి? అనే అహంకార భావనలో సల్మాన్ ఖాన్ ఉంటే.. ఇత‌డు ఎంత పెద్ద స్టార్ హీరో అయితే నాకేంటి.. నన్ను ఎదిరించి ఈ ప్రాంతంలో ఎలా తిరుగుతాడో చూస్తాం? అన్నట్లుగా బిష్ణోయ్ గ్యాంగ్ వ్యవహరిస్తోంది. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న ఈగో క్లాష్ ఈరోజు మొత్తం సినిమా పరిశ్రమకే ఒక పెద్ద భద్రతా ముప్పుగా మారింది.

1998 నాటి కృష్ణజింకల వేట కేసు తర్వాత బిష్ణోయ్ కమ్యూనిటీ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ సమాజం కోరినట్లుగా వారి ఆరాధ్య దేవత ఆలయం వద్దకు వెళ్లి క్షమాపణలు కోరి ఉంటే, అసలు ఈ రక్తపాతం, భయాందోళనల చరిత్రే ఉండేది కాదు. కానీ ఈగోకి పోవడం వల్ల ఈ వివాదం రోజురోజుకూ ముదిరి పాకాన పడింది. ఈ మాఫియా వర్సెస్ స్టార్ హీరో ఆటలో ఇప్పటివరకు ఎంతోమంది ప్రాణాలు ప్రమాదంలో పడగా.. మున్ముందు ఇంకా ఎంతమంది అమాయకులు బలికావాల్సి వస్తుందో తెలియని తీవ్ర అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. జ‌రిగిన త‌ప్పును స‌రి చేసుకునేందుకు ఒకే ఒక్క క్ష‌మాప‌ణ కోరిన బిష్ణోయ్ క‌మ్యూనిటీకి స‌ల్మాన్ ఎందుకు వ్య‌తిరేకంగా ఉన్నారోన‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ ప్ర‌జ‌ల్లో కొన‌సాగుతోంది.

ఈ భయానక వాతావరణంపై బాలీవుడ్ స‌హా సినీపరిశ్ర‌మ‌ల్లో తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. నిజానికి స‌ల్మాన్ ఈ గొడ‌వ‌ల‌కు స్వ‌స్థి ప‌ల‌క‌గ‌ల‌డు.. కానీ ఆ ప‌ని చేయ‌డం లేదు. అత‌డు బిష్ణోయ్ క‌మ్యూనిటీకి భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ కోరితే త‌ప్పేంటి? అనే చ‌ర్చ విస్త్ర‌త‌మైంది. 1998 నాటి ఉదంతం కారణంగా దెబ్బతిన్న వారి మనోభావాలను గౌరవించి.. క్షమాపణ కోరడమే ఈ వివాదానికి ఏకైక పరిష్కార మార్గమని కూడా చ‌ర్చించుకుంటున్నారు.

ఈ వివాదాన్ని సల్మాన్ ఖాన్ ఇలాగే వదిలేస్తే లేదా ఈగోకి పోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయని అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. ఈ శత్రుత్వం వల్ల కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా.. ఆయనతో కలిసి పనిచేసే సహచరులు, తోటి నటీనటులు, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రమాదంలో పడతారనే ఆందోళన క‌నిపిస్తోంది. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ చుట్టూ ఉన్నవారిని.. ఆయన సన్నిహితులను కూడా లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా బెదిరించ‌డ‌మే గాక ఆచ‌రిస్తున్న నేపథ్యంలో ఈ రచ్చను ఆపడానికి సల్మాన్ వెంటనే ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప‌లువురు సూచిస్తున్నారు.

ముంబైలోని జుహూలో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సల్మాన్ క్షమాపణ చెప్పాలని మళ్లీ డిమాండ్ చేసింది. ఫలితంగా ముంబై వ్యాప్తంగా.. సినిమా సర్కిల్స్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. ఇప్పటికైనా వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి.. అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు సల్మాన్ ఖాన్ ఒక అడుగు వెనక్కి వేసి పరిష్కారం వైపు వెళ్తారా లేదా ఈ ప్రతీకార రాజకీయం మరిన్ని ప్రాణాలను బలితీసుకుంటుందా అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో ఉత్కంఠగా మారింది.

స‌ల్మాన్ ఖాన్ స్నేహితుడే అయిన ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ, గాయ‌కుడు సిద్ధూ మూసేవాలాల‌ను అంత‌మొందించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, స‌ల్మాన్ కి అత్యంత స‌న్నిహితులైన‌ రోహిత్ శెట్టి, టైగ‌ర్ ష్రాఫ్‌ల‌ను బెదిరించింది. ఇంకా ఎంత‌మంది తో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆట‌లు ఆడుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. స‌ల్మాన్ తో క‌లిసి ప‌ని చేసేందుకు ఇప్పుడు ద‌క్షిణాది ఫిలింమేక‌ర్స్ కూడా భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. గ్యాంగ్ స్ట‌ర్ల బెదిరింపుల్ని ఎదుర్కొని అత‌డితో క‌లిసి ప‌ని చేసేందుకు ఇంకా ఎవ‌రు సిద్ధంగా ఉన్నారో .. వారి మాన‌సిక‌ ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి.

Tags:    

Similar News