గంగూలీ షర్ట్‌లెస్ సంబరాల స్ఫూర్తితో దూస్రా!
2002లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో టీమిండియా నాట్‌వెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న వేళ అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ జెర్సీ విప్పి గాల్లో ఊపిన క్షణం భారత క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచింది.
2002లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో టీమిండియా నాట్‌వెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న వేళ అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ జెర్సీ విప్పి గాల్లో ఊపిన క్షణం భారత క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచింది. ఆ చారిత్రాత్మక ఘట్టం స్ఫూర్తితో తెరకెక్కిన తాజా చిత్రం `దూస్రా`. `ఢిల్లీ బెల్లీ` ఫేమ్ అభినయ్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ `A` (అడల్ట్) సర్టిఫికేట్ మంజూరు చేయడంతో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అభినయ్ తన అనుభవాలను పంచుకున్నారు.
బాబ్రీ మసీదు ప్రస్తావనలు.. కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినా? కథలోని సహజత్వాన్ని దెబ్బతీసేలా కట్స్ వేసుకోవడం కంటే `A` సర్టిఫికేట్ పొందడానికే తాను ప్రాధాన్యత ఇచ్చానని అభినయ్ డియో తెలిపారు. సెన్సార్ బోర్డుతో వివాదాలు ఎదుర్కొనే ఇతర దర్శకుల అనుభవాలకు భిన్నంగా, తనకు మాత్రం బోర్డుతో ఎప్పుడూ ఎలాంటి ఘర్షణలు .. గొడవలు జరగలేదని స్పష్టం చేశారు.
బోర్డుతో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. `నా మొదటి సినిమా `ఢిల్లీ బెల్లీ`తో పాటు ఇప్పుడు చేసిన `దూస్రా` రెండూ అడల్ట్ సర్టిఫికేట్ పొందిన చిత్రాలే. విచిత్రమేమిటంటే? ఈ రెండు సినిమాల్లోనూ ఎలాంటి పెద్ద కట్స్ లేకుండా కేవలం ఒక్క పదాన్ని మాత్రమే మార్చి సెన్సార్ బోర్డు ఆమోదించింది. బోర్డు సభ్యులతో నా సమావేశాలు 7 నుంచి 10 నిమిషాల్లో ముగిశాయి. కట్స్ విధించి `U/A` ఇవ్వడం కంటే కథ దెబ్బతినకుండా `A` సర్టిఫికేట్ ఇవ్వడమే నాకు నచ్చిందని చెప్పాను` అని డియో వివరించారు.
సినిమా థీమ్‌ను ఉద్దేశించి స్పందించారు. `ఈ చిత్రం 13 ఏళ్ల పిల్లలు సొంతంగా వచ్చి చూసేది కాకపోయినా? వారి వయసు వారు తప్పక చూడాల్సిన కథ ఇది. థియేటర్లలో `A` సర్టిఫికేట్‌తో విడుదలైనా? ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ సందేశం అందరికీ చేరుతుందనే నమ్మకం ఉంది` అన్నారు. రాజస్థాన్‌కు చెందిన `తార` అనే యువతి సాంప్రదాయ కుటుంబపు ఆంక్షలను ధిక్కరించి.. తన స్వేచ్ఛ కోసం పోరాడే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ప్లబితా బోర్‌ఠాకూర్ ప్రధాన పాత్ర పోషించారు.
మరొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే? 78 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని ఇంటర్వెల్ లేకుండా ఒకేసారి ప్రదర్శించాలని డియో భావిస్తున్నారు. `78 నిమిషాల తీవ్రమైన డ్రామా ఉన్న సినిమాకు బ్రేక్ అవసరం లేదు. ఈ రోజుల్లో కొన్ని సినిమాల మొదటి భాగమే ఇంతకంటే ఎక్కువ నిడివి ఉంటోంది. థియేటర్ నిర్వాహకులకు పాప్‌కార్న్ అమ్మకాలు వ్యాపారపరంగా ముఖ్యమే అయినా? కథ ప్రవాహానికి, సినిమా అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం` అని ఆకాంక్షించారు.
మాషా సజ్దే, రోహన్ సజ్దే నిర్మించిన ఈ చిత్రానికి రామ్ సంపత్ సంగీతం అందించారు. లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చూపించిన ఆత్మవిశ్వాసం, తిరుగుబాటు ధోరణిని కథానాయిక తార జీవితానికి అనుసంధానిస్తూ తెరకెక్కించిన ‘దూస్రా’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.