ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న శ్రీనివాస మంగాపురం!
తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రోత్సాహంతో శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు జయకృష్ణ.
ఘట్టమనేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు దివంగత సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ. తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రోత్సాహంతో శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు జయకృష్ణ. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమౌతూ నటించిన చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అభిమానుల ఆశలపై నీళ్లు చలిన డైరెక్టర్..
ఘట్టమనేని వారసుడు అంటే కచ్చితంగా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాయమని , ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులే ఈ సినిమాను సూపర్ హిట్ చేస్తారు అంటూ సినిమా విడుదలకు ముందు ఎంతోమంది పలు రకాల కామెంట్లు చేశారు. అయితే కంటెంట్ లేకపోతే ఎంతటి సూపర్ స్టార్ వారసుడైనా ఇండస్ట్రీలో ఫ్లాప్ ను చవి చూడక తప్పదు అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇందులో జయకృష్ణ , రాషా తడానీ ల పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ , దర్శకుడు రాసుకున్న స్టోరీ తెరపై చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అనే కామెంట్లు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు కీలకమైన పాత్ర పోషించగా.. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ అందించిన సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచినప్పటికీ.. ఏవీ కూడా సినిమా సక్సెస్ లో భాగం కాలేకపోయాయి.
పైగా డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఈ సినిమా ఫ్లాప్ బాధ్యత మొత్తం తనదేనంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. అలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటిస్తూ ఆగస్టు 20 నుంచి శ్రీనివాస మంగాపురం డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్, అలాగే వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించాయి. థియేటర్లలో ఫ్లాప్ ను చవిచూసిన ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మించగా.. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పించింది
శ్రీనివాస మంగాపురం సినిమా స్టోరీ..
తిరుపతి నేపథ్యంలో సాగిన ఈ కథలో అప్పుడే కొత్తగా నగరంలోకి అడుగు పెట్టిన యువకుడు శ్రీను (జయకృష్ణ). అక్కడ పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి గారాల కూతురు మంగా(రాషా తడానీ)ని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమెకు చేరువయ్యే ప్రయత్నంలో అనుకోకుండా మంగ జీవితానికి సంబంధించిన గత తాలూకు షాకింగ్ నిజం ఒకటి తెరపైకి వస్తుంది. అసలు ఆ రహస్యాన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? శ్రీను నేపథ్యం ఏమిటి? మంగతో అతనికి ఉన్న పాత సంబంధం ఏమిటి? బళ్లారి ప్రాంతానికి చెందిన వెంకటప్పయ్య ( మోహన్ బాబు), లక్ష్మీపతి (అజయ్ ) ల మధ్య జరిగిన వివాదాలు ఈ కథను ఎలాంటి మలుపులు తీశాయి. చివరికి శ్రీను తన ప్రేమను గెలిపించుకుంటాడా? ఇందులో మోహన్ బాబు పాత్ర ఏంటి? తదితర విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.