తమ్ముడైనా ఆ పని మాత్రం చేయను
తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ అంటే విజయ్ కు ఎంతో ఇష్టం. ఆనంద్ కు విజయ్ ఇచ్చే సపోర్ట్ వెలకట్ట లేనిది.;
ముందు సపోర్టింగ్ క్యారెక్టర్ల ద్వారా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత హీరోగా మారి స్టార్ గా ఎదిగిన వైనం అందరికీ ఆదర్శప్రాయం. అలా స్టార్ గా మారడానికి విజయ్ ఎంతో కష్టపడ్డారు. మొత్తానికి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పరచుకున్నారు విజయ్. అన్న బాటలోనే తాను కూడా అంటూ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఆనంద్ దేవరకొండ తన అన్న తరహా సక్సెస్ అవకపోయినా తాను కూడా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ అనే సినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. జులై 31న కింగ్‌డమ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విజయ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ అంటే విజయ్ కు ఎంతో ఇష్టం. ఆనంద్ కు విజయ్ ఇచ్చే సపోర్ట్ వెలకట్ట లేనిది. అయితే తన తమ్ముడంటే ఇష్టమున్నప్పటికీ ఆనంద్ కు సినిమాల విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వనని విజయ్ దేవరకొండ చెప్పారు. ఫ్యూచర్ లో తన కొడుకు విషయంలో కూడా అంతే ఉంటానని, ఆనంద్ ఎప్పుడైనా ఫలానా సినిమా చేస్తున్నానని చెప్తే వింటా తప్పించి మిగిలిన వివరాలేమీ అడగనని, లైఫ్ లో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటుంటానని విజయ్ అన్నారు.
ఒక యాక్టర్ జర్నీ ఎంత కష్టమనేది తనకు తెలుసని, అందుకే వేరే ఏవీ పట్టించుకోకుండా తనపై తనకు నమ్మకముంటేనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టమని, లేదనంటే వద్దని ఆనంద్ కు ముందే చెప్పానని విజయ్ దేవరకొండ చెప్పారు. ఈ విషయంలో కెరీర్ స్టార్టింగ్ లో ఆనంద్ ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు వాటిని అలవాటు చేసుకుని తనదైన శైలిలో కెరీర్లో ముందుకెళ్తున్నట్టు విజయ్ తెలిపారు.
ఇదే సందర్భంగా తమిళ హీరోలైన సూర్య, కార్తీ అన్నదమ్ములని తనకు తెలియదని విజయ్ వెల్లడించారు. వారిద్దరూ అన్నదమ్ములనే విషయం చాలా కాలం తర్వాత తెలిసిందని విజయ్ చెప్పారు. గజినీ సినిమా చూసినప్పటి నుంచి సూర్యకు ఫ్యాన్స్ గా మారిపోయానని చెప్పిన విజయ్ దేవరకొండ, ఆయన యాక్టింగ్, డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయేవాడినని, సినిమాల్లోకి వచ్చాక ఆయనలా అవాలనుకున్నానని, చాలా సార్లు కార్తీ, సూర్యను కలవడానికి ప్రయత్నించానని విజయ్ వెల్లడించారు.