పిల్లల సమక్షంలో పెళ్లికి సిద్ధమవుతున్న బోల్ట్!
తమ ముగ్గురు పిల్లల సమక్షంలో, బోల్ట్ 40వ జన్మదిన వేడుకల్లో మోకాలిపై కూర్చొని గ్రాండ్‌గా సర్ ప్రైజ్ ప్రపోజల్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్, ఒలింపిక్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ త్వరలోనే పీటలెక్కబోతున్నారు. దాదాపు పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న తన ప్రేయసి కాసీ బెన్నెట్‌తో ఆయన ఎంగేజ్మెంట్ నిశ్చయమైంది. తమ ముగ్గురు పిల్లల సమక్షంలో, బోల్ట్ 40వ జన్మదిన వేడుకల్లో మోకాలిపై కూర్చొని గ్రాండ్‌గా సర్ ప్రైజ్ ప్రపోజల్ చేశారు. ఈ ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫొటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి..
బర్త్‌డే పార్టీ కాస్తా ఎంగేజ్మెంట్ వేడుకగా:
జమైకాలోని కింగ్స్టన్ వేదికగా జరిగిన ఉసేన్ బోల్ట్ 40వ జన్మదిన వేడుకలు ఊహించని మలుపు తిరిగాయి. చెక్ సూట్ ధరించిన బోల్ట్, మైక్ పట్టుకుని అందరి ముందూ మోకాలిపై కూర్చుని కాసీ బెన్నెట్‌కు ఐదు క్యారట్ల వజ్రపు ఉంగరాన్ని అందిస్తూ ప్రపోజ్ చేశారు. ఇక ఈ సర్ ప్రైజ్‌తో కాసీ బెన్నెట్ ఆనందంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తమిత్రుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఎవరు ఈ కాసీ బెన్నెట్?:
కాసీ బెన్నెట్ జమైకాకు చెందిన ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త మరియు స్వచ్ఛంద కార్యకర్త. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె, 'ప్రాజెక్ట్ కేస్' అనే సంస్థ ద్వారా చిన్నారులకు విద్యా పరికరాలు, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్ అయిన బోల్ట్‌తో రిలేషన్‌లో ఉన్నప్పటికీ, తన సొంత వ్యక్తిత్వాన్ని, వ్యాపార ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
పదేళ్ల బంధం.. ముగ్గురు పిల్లలు:
2013 ప్రాంతంలో ప్రారంభమైన వీరి ప్రేమ బంధం 2016 రియో ఒలింపిక్స్ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఇక పదేళ్లకు పైగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2020లో కుమార్తె 'ఒలింపియా లైట్నింగ్ బోల్ట్' జన్మించగా, 2021లో కవల పిల్లలు 'థండర్ బోల్ట్', 'సెయింట్ లియో బోల్ట్' జన్మించారు.
త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్:
సహజీవనంలో ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన బోల్ట్-కాసీ జంట, ఇప్పుడు అధికారికంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. పిల్లల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థం క్రీడాభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక పదేళ్ల అనుబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోబోతున్న ఈ లవ్లీ కపుల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..