సెట్లో హీరోయిన్‌లు ఎదుర్కొనే ఆ సీరియ‌స్ స‌మ‌స్య‌పై దేవ‌ర‌కొండ‌ వ్యాఖ్య‌లు

రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన `పెద్ది` చిత్రం ఇటీవల విడుదలైనా.. అనుకున్న స్థాయిలో సానుకూల ప్రశంసలు దక్కించుకోలేకపోయింది.

Update: 2026-10-21 17:07 GMT

రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన `పెద్ది` చిత్రం ఇటీవల విడుదలైనా.. అనుకున్న స్థాయిలో సానుకూల ప్రశంసలు దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్రను చిత్రీకరించిన తీరు, ఆమెను మితిమీరి గ్లామరైజ్ చేయడం - ఆబ్జెక్టిఫై చేశారనే విషయమై ప్రేక్షకులు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల పాపుల‌ర్ టీవీ కార్యక్రమం`కాఫీ విత్ కరణ్` సీజన్ 9 రెండవ ఎపిసోడ్‌లో పాల్గొన్న నవదంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వద్ద హోస్ట్ కరణ్ జోహార్ ఈ వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించారు.

సినిమాల్లో బోల్డ్ పాత్రలు -హద్దుల గురించి కరణ్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ.. గ్లామర్ ప్రదర్శనకు సంబంధించి తన వ్యక్తిగత పరిమితులు చాలా స్పష్టంగా ఉంటాయని పేర్కొన్నారు. పరిమితికి మించి ఎక్స్‌పోజింగ్ లేదా స్కిన్ షో చేయడానికి తాను అస్సలు సౌకర్యవంతంగా ఉండనని స్ప‌ష్ఠంగా చెప్పారు. కమర్షియల్ సినిమాల్లో కొన్నిసార్లు ఇబ్బందికరమైన దుస్తులు ధరించాల్సి వచ్చినా.. తన హద్దులు దాటకుండా నటిస్తానని.. ఈ విషయంలో దర్శకులతో ముందే స్పష్టంగా మాట్లాడతానని ఆమె వెల్లడించారు.

ఇదే అంశంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సెట్స్‌లో ఇబ్బందికరమైన సన్నివేశాలు లేదా దుస్తులను తిరస్కరించే విషయంలో నటీనటులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వద్దని చెబితే ఎక్కడ తమను `అన్‌ప్రొఫెషనల్` అని ముద్ర వేస్తారోనని చాలామంది భయపడతారని.. అలాంటి సమయంలో ఆర్టిస్టులకు మానసిక ధైర్యాన్ని, మద్దతును ఇచ్చే బలమైన వ్యవస్థ సినీ పరిశ్రమలో ఉండాలని విజయ్ నొక్కి చెప్పారు. రష్మిక సైతం నటీనటులు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పేలా మేకర్స్ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

అయితే ఈ ఎపిసోడ్ ప్రొమోలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద కలకలాన్నే రేపాయి. పెళ్లి చేసుకోవాలని రష్మిక తననే దాదాపు 100 సార్లు అడిగిందని విజయ్ సరదాగా అనడం, దానికి రష్మిక అవునని సమాధానమివ్వడం ఆస‌క్తిక‌రం.

అయితే దీనిపై కొంత‌ ట్రోలింగ్ ఎదుర‌వ‌గ‌.. విజయ్ స్పందిస్తూ తాను చెడ్డవాడిని కానని సరదాగా సమర్థించుకోగా, ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో అల్లు అర్జున్, రణబీర్ కపూర్లలో అల్లు అర్జున్‌కే రష్మిక ప్రాధాన్యత ఇవ్వడం..అలాగే విజయ్‌కి వేరే ఏ కథానాయికతోనూ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండదని రష్మిక చెప్పడం విశేషం. దానికి విజయ్ స్పందిస్తూ ``భార్య చెప్పేదానికి ఒప్పుకోవడమే వైవాహిక జీవితంలో మొదటి నియమం`` అని నవ్వులు పూయించారు.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వెండితెరపై మెప్పించి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ప్రస్తుతం వారు కలిసి నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా `రణబాలి`తో థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Tags:    

Similar News