అవనిగా మెరిసిపోతున్న త్రిష
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర.;
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇవాళ త్రిష పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. విశ్వంభరలో త్రిష అవని పాత్రలో కనిపించనుంది.
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో త్రిష సంప్రదాయ చీరకట్టులో భలే మెరిసిపోయింది. త్రిష బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ త్రిష కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ భారీగా ఉండనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికీ క్లారిటీ ఇచ్చింది.
చిరూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఓ వైపు షూటింగ్ ను నిర్వహిస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తూ మేకర్స్ నిర్మాణాన్ని చాలా వేగవంతం చేశారు. విశ్వంభరకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు చెప్తున్నారు. యువి క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే త్రిష, చిరంజీవి కలిసి గతంలో స్టాలిన్ సినిమాలో నటించారు. అప్పట్నుంచి మళ్లీ ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించింది లేదు. ఇప్పటికే విశ్వంభర పై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాలుగు పదుల వయసులో కూడా త్రిష కెరీర్ పరంగా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన త్రిష ఆ తర్వాత పలు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం త్రిష విశ్వంభర తో పాటూ థగ్ లైఫ్, సూర్య45, రామ్ సినిమాల్లో నటిస్తోంది.