మరో వివాదంలో ఆర్యన్ ఖాన్.. పబ్ లో అలా చేయడంతో!

అయితే వ్యక్తిగత పరంగా ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచిన ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారారు.;

Update: 2025-12-05 09:37 GMT

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ ఖాన్, డెబ్యూ ప్రాజెక్టుతో అందరినీ మెప్పించారు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ టైటిల్ తో రూపొందించిన వెబ్ సిరీస్ ఆకట్టుకోవడంతో.. ఆర్యన్ ఖాన్ ను విమర్శకులు కూడా ప్రశంసించారు.

అయితే వ్యక్తిగత పరంగా ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచిన ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. గతంలో ముంబై తీరంలో క్రూయిజ్ నౌకపై జరిగిన డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా వారాల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌ పై విడుదలయ్యారు.

2022 మేలో ఆర్యన్ ఖాన్ పై ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) క్లీన్ చిట్ ఇచ్చింది. అంతే కాదు ఎన్సీబీ మాజీ జోన్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పై అవినీతి అభియోగాలు మోపింది. అలా మూడేళ్ల క్రితం డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డ ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.

ఇటీవల బెంగళూరులోని ఓ పబ్ కు వెళ్లిన ఆర్యన్.. అక్కడ జరిగిన ప్రైవేట్ ఈవెంట్ లో అసభ్యకరమైన సంజ్ఞ (మధ్య వేలు చూపించడం) చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజన్లు.. బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరికొందరు అది సరదాగా చేసి ఉంటారని ఆర్యన్ కు మద్దతు పలికారు. అయితే ఇప్పుడు సాంకీ రోడ్‌ కు చెందిన న్యాయవాది ఒవైజ్ హుస్సేన్.. ఆర్యన్ పై ఫిర్యాదు చేశారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్, సెంట్రల్ డివిజన్ DCP, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌తో సహా అనేక అధికారులకు తన ఫిర్యాదు సమర్పించారు.

మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందని, బహిరంగ ప్రదేశంలో ఆర్యన్ ఖాన్ అసభ్యకరమైన సంజ్ఞ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా బెంగళూరు పోలీసులు.. పబ్‌ లో ఆర్యన్ ఖాన్ చేసిన సంజ్ఞపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. అదే సమయంలో ఆ వీడియోలో ఆర్యన్ ఖాన్ సహా పలువురు యువకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మరి బెంగళూరు పబ్ విషయంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News