ట్రైలర్ వ్యూస్ ఎక్కువంటే.. సినిమా హిట్ అన్నట్టేనా?

ఈమధ్య పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే మొదటి 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్నదే బాగా హైలెట్ అవుతోంది.

Update: 2026-08-25 01:30 GMT

ఈమధ్య పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే మొదటి 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్నదే బాగా హైలెట్ అవుతోంది. 10 మిలియన్, 30 మిలియన్, 50 మిలియన్ అంటూ పోస్టర్లు కూడా వస్తున్నాయి. కానీ ఆ వ్యూస్ నిజంగా సినిమా మీద ఉన్న క్రేజ్‌ను పూర్తిగా చూపిస్తాయా అంటే అంత సింపుల్ కాదు. ట్రైలర్ చూడటం ఒకటి.. టికెట్ కొనుకుని థియేటర్‌కు వెళ్లడం మరోటి.

ముందుగా అన్ని వ్యూస్‌ను ఒకేలా చూడలేం. కొంత వరకు ఆ రెస్పాన్స్ అనేది నిజంగా సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నుంచి వస్తుంది. ఇంకొంత పెయిడ్ ప్రమోషన్ వల్ల రావచ్చు. ఒకే వ్యక్తి ట్రైలర్‌ను రెండు మూడు సార్లు చూసినా వ్యూస్ పెరుగుతాయి. స్టార్ హీరో సినిమా అయితే ఫ్యాన్స్ మొదటి గంట నుంచే రిపీట్‌గా చూస్తారు. న్యూట్రల్ ఆడియన్స్, జనరల్ పబ్లిక్ నుంచి వచ్చే స్పందన మాత్రం వేరుగా ఉంటుంది.

ట్రైలర్ బాగుందని చెప్పిన వాళ్లందరూ మొదటి రోజు టికెట్ కొనరు. కొందరు రివ్యూలు చూసి వెళ్తారు. మరికొందరు వీకెండ్ వరకు ఆగుతారు. టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ఇంకొందరు వెనక్కి తగ్గొచ్చు. అందుకే ట్రైలర్‌కు భారీ వ్యూస్ వచ్చినా ఫస్ట్ డే కలెక్షన్స్ అదే స్థాయిలో రావాలని రూల్ లేదు. స్టార్ పేరు వల్ల ట్రైలర్‌కు నంబర్లు రావచ్చు కానీ సినిమా మీద నిజమైన డిమాండ్ బుకింగ్స్ దగ్గర ఎక్కువగా తెలుస్తుంది.

సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్, షేర్లు కూడా బజ్‌ను చూపిస్తాయి. కానీ అవి కూడా బాక్సాఫీస్‌కు గ్యారెంటీ కాదు. ఫ్యాన్స్ ఒక ట్రైలర్‌ను వైరల్ చేయగలరు. కానీ వారం రోజుల తర్వాత కూడా ఆ సినిమా గురించి జనాలు మాట్లాడాలంటే కంటెంట్ పని చేయాలి. ట్రైలర్ ఇచ్చిన హైప్ రిలీజ్ తర్వాత మంచి టాక్ లేకపోతే చాలా త్వరగా తగ్గిపోతుంది.

చిన్న సినిమాల దగ్గర దీనికి రివర్స్ కూడా జరుగుతుంది. ట్రైలర్‌కు పెద్దగా వ్యూస్ ఉండకపోవచ్చు. హీరోకు భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉండకపోవచ్చు. కానీ సినిమా బాగుంటే మొదటి రోజు తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ పెరుగుతుంది. రెండో వీకెండ్ వరకు కలెక్షన్స్ పెరిగే సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే తక్కువ వ్యూస్ అంటే చిన్న సినిమా ఫెయిల్ అని ముందే చెప్పలేం.

ట్రైలర్ వ్యూస్ కంటే అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్ సేల్స్ స్పీడ్, ప్రేక్షకుల రెస్పాన్స్, రిలీజ్ తర్వాత రిపీట్ ఆడియన్స్ లాంటి లెక్కలు బాక్సాఫీస్‌కు ఎక్కువ దగ్గరగా ఉంటాయి. ట్రైలర్ ఒక సినిమాను జనాల ముందుకు తీసుకెళ్తుంది. కానీ వాళ్లను థియేటర్ వరకు తీసుకురావాలంటే ట్రైలర్ తర్వాత కూడా చాలా విషయాలు కలిసి రావాలి. చివరకు ఎంతమంది ట్రైలర్ చూశారు అన్నదానికంటే, చూసిన వాళ్లలో ఎంతమంది టికెట్ కొన్నారు అన్నదే నిర్మాతకు అసలు ఉపయోగపడే నంబర్.

Tags:    

Similar News