ఒక్క సినిమా కోసం ఏడాది ఇవ్వలేను.. టోవినో కీలక వ్యాఖ్యలు

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు.;

Update: 2026-04-01 07:54 GMT

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. గత కొంతకాలంగా ఆ సినిమాలో పవర్‌ ఫుల్ విలన్ పాత్రలో టోవినో కనిపిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ వార్తలకు స్వయంగా ఆయన ఫుల్‌ స్టాప్ పెట్టారు.

హైదరాబాద్‌ లో తన తాజా మలయాళ చిత్రం పల్లిచట్టంబి ప్రమోషన్స్‌ లో పాల్గొన్న టోవినో థామస్.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాపై వస్తున్న వార్తల గురించి ప్రశ్నించగా, తాను ఆ ప్రాజెక్టులో నటించడం లేదని స్పష్టం చేశారు. డేట్స్ మేనేజ్మెంట్ సమస్యల కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

"తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ మాలీవుడ్ వర్క్ ప్రాసెస్, టాలీవుడ్ మేకింగ్ స్టైల్ మధ్య చాలా తేడా ఉంటుంది. మేం సాధారణంగా తక్కువ సమయంలో ఒక సినిమా పూర్తిచేస్తాం. కానీ తెలుగులో పెద్ద సినిమాలు కంప్లీట్ కావడానికి చాలా కాలం పడుతుంది" అని టోవినో థామస్ వివరించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "నేను ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటించను. ఒక ప్రాజెక్టుకు పూర్తి సమయం కేటాయించడం నాకు ఇష్టం. మలయాళంలో ఒకే షెడ్యూల్‌ లో సినిమాలు పూర్తవుతాయి. కానీ తెలుగులో ఒక సినిమా కోసం దాదాపు ఏడాది సమయం కేటాయించాల్సి వస్తుంది. నేను గరిష్టంగా మూడు నెలలు ఇవ్వగలను. అంతకంటే ఎక్కువ కాలం ఒకే ప్రాజెక్ట్‌ కు కేటాయిస్తే, ఇప్పటికే కమిట్ అయిన ఇతర సినిమాలపై ప్రభావం పడుతుంది" అని అన్నారు.

ప్రస్తుతం తన చేతిలో నాలుగైదు మలయాళ చిత్రాలు ఉన్నాయని, వాటిని వదిలి ఒక విలన్ పాత్ర కోసం ఎక్కువ కాలం కేటాయించడం రిస్క్‌ గా భావించానని టోవినో స్పష్టం చేశారు. అందుకే డేట్స్ సెట్ కాకపోవడంతో ఆ భారీ ప్రాజెక్ట్‌ ను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చేయకూడదనే కాదు.. కానీ ప్రాక్టికల్‌ గా సాధ్యపడలేదని అని ఆయన తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించారు.

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ఆ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. టోవినో తప్పుకోవడంతో.. ఆయన కోసం అనుకున్న పవర్‌ ఫుల్ పాత్రకు మరో నటుడిని మూవీ టీమ్ తీసుకుందని సమాచారం. దీంతో ఆ రోల్‌ లో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.




Tags:    

Similar News