గబ్బర్ సింగ్ రమేష్ కి అండగా మెగా ఫ్యామిలీ!
కమెడియన్ గా, నటుడిగా పలు సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈయన.. సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ కి గురై అపోలో హాస్పిటల్లో చేరారు.
మానవత్వానికి మరో పేరుగా నిలిచిన మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది వీరు సహాయం పొందిన బాధితులు వారికి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు మెగా ఫ్యామిలీ మరో కుటుంబానికి అండగా నిలిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశంలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న గబ్బర్ సింగ్ రమేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
గబ్బర్ సింగ్ రమేష్ కి బ్రెయిన్ స్ట్రోక్..
కమెడియన్ గా, నటుడిగా పలు సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈయన.. సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ కి గురై అపోలో హాస్పిటల్లో చేరారు. విషయం వైరల్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఐసీయూలో గబ్బర్ సింగ్ రమేష్ కి చికిత్స అందిస్తున్నారు అని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు గబ్బర్ సింగ్ ,చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి వైద్య బృందంతో గబ్బర్ సింగ్ రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
స్పందించి మానవత్వం చాటుకుంటున్న మెగా ఫ్యామిలీ..
ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు తెలియడంతో ఆయన స్పందించారు. అపోలో హాస్పిటల్ లో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచూ మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారట. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తానని చిరంజీవి రమేష్ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడమే కాకుండా చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి సుమారుగా 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
రమేష్ శస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు..
మరోవైపు చిరంజీవితో పాటు నాగబాబు కూడా మరో రెండు లక్షల రూపాయలను రమేష్ సతీమణికి అందించి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తానికైతే తోటి కళాకారుల పట్ల చిరంజీవి ఎప్పటినుంచో చూపిస్తున్న ఆప్యాయత , ఆత్మీయత , బాధ్యత భావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది అంటూ పలువురు మెగా కుటుంబం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రమేష్ శస్త్ర చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. మరొకవైపు బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీ పూర్తయింది అనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై హాస్పిటల్ బృందం అధికారికంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే
రమేష్ నటించిన చిత్రాలు..
గబ్బర్ సింగ్ రమేష్ విషయానికి వస్తే.. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్న రమేష్.. మళ్లీ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా సందడి చేశారు. అలాగే అత్తారింటికి దారేది సినిమాలో తన అద్భుతమైన నటనను కనబరిచారు. రామయ్య వస్తావయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన ఈయన.. ఇటీవల వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. ఇక ఏది ఏమైనా తనదైన కామెడీతో పువ్వులు పూయించిన రమేష్.. మళ్ళీ తిరిగి కోలుకోవాలని ,ఎప్పటిలాగే నవ్వుతూ తెరపై కనిపిస్తూ అందరిని నవ్వించాలి అని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.