టాలీవుడ్ నెక్స్ట్ టార్గెట్ అదేనా? రంగం సిద్ధమా?
ఒకప్పుడు రూ.1 కోటి వసూళ్లు సాధిస్తేనే అది భారీ విజయంగా భావించేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా వేల కోట్ల మార్కెట్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.
ఒకప్పుడు రూ.1 కోటి వసూళ్లు సాధిస్తేనే అది భారీ విజయంగా భావించేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా వేల కోట్ల మార్కెట్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తూ వచ్చిన టాలీవుడ్.. ఇప్పుడు రూ.2 వేల కోట్ల మార్క్ ను అందుకునే స్టామినా ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. తెలుగు సినిమా బాక్సాఫీస్ జర్నీ చూస్తే.. ప్రతి మైల్ స్టోన్ దాటిన సందర్భంలో కొత్త చరిత్రే కనిపిస్తుంది.
1957లో విడుదలైన మాయాబజార్ తొలి రూ.1 కోటి గ్రాస్ సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి రూ.10 కోట్ల మార్క్ ను అందుకుంది. 1999లో సమరసింహారెడ్డి రూ.25 కోట్ల వసూళ్లతో మరో రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ వేగంగా పెరిగింది. 2006లో పోకిరి రూ.50 కోట్ల క్లబ్ లో చేరగా, 2009లో మగధీర తొలి రూ.100 కోట్ల తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది.
దీంతో టాలీవుడ్ మార్కెట్ మరింత పెరగడం ప్రారంభమైంది. 2015లో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత బాహుబలి 2 మూవీ 2017లో రూ.1000 కోట్లతో పాటు రూ.1500 కోట్ల మార్క్ ను కూడా దాటి భారతీయ సినిమా చరిత్రలో కొత్త చాప్టర్ రాసింది.
ఆ తర్వాత కూడా టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు వరుసగా వస్తున్నాయి. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో కూడా భారీ మార్కెట్ ఏర్పడింది. నార్త్ ఇండియాతో పాటు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో కూడా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. డబ్బింగ్, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ లో, ఫుల్ ప్రమోషన్స్ వంటి అంశాలు వసూళ్లను మరింత పెంచుతున్నాయి.
అయితే ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో రూ.2 వేల కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన చిత్రం ఒక్కటే ఉంది. ఆ ఘనత దంగల్ సొంతం. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీంతో టాలీవుడ్ నుంచి కూడా అలాంటి ఘనత సాధించే సినిమా ఎప్పుడు వస్తుందనే ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం భారీ కాన్సెప్ట్ లు, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్ లు, పాన్ వరల్డ్ మార్కెటింగ్ పై తెలుగు నిర్మాతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
స్టార్ హీరోల సినిమాలు విడుదలకు ముందే భారీ బిజినెస్ చేయడం ఇప్పుడు సాధారణంగా మారుతోంది. దీంతో సరైన కథ, స్ట్రాంగ్ కంటెంట్ కలిస్తే రూ.2 వేల కోట్ల మార్క్ కూడా టాలీవుడ్ కు కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రూ.1 కోటి నుంచి రూ.1500 కోట్ల వరకు ప్రతి మైలురాయిలో తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇప్పుడు అదే జర్నీలో నెక్స్ట్ టార్గెట్ రూ.2 వేల కోట్ల క్లబ్ గా మారింది. ఆ రికార్డును అందుకునే తొలి తెలుగు చిత్రం ఏదవుతుందో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.