ఈ సమ్మరంతా డబ్బింగ్ దండయాత్రే!
సాధారణంగా సమ్మర్ సీజన్ అంటే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుంటాయి.;
సాధారణంగా సమ్మర్ సీజన్ అంటే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. కానీ ఈ వేసవి సందడి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ ఏడాది స్టార్ హీరోల చిత్రాలు బరిలో లేకపోవడంతో ఆ ఖాళీని పూరించడానికి డబ్బింగ్ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇతర భాషల్లో ఘనవిజయం సాధించిన చిత్రాలు వరుసగా తెలుగులోకి క్యూ కట్టడంతో ఈ సమ్మర్ సీజన్‌ను డబ్బింగ్ చిత్రాలు పూర్తిగా క్యాష్ చేసుకునేలా ఉన్నాయి. ఈ వారమే మలయాళ సాహస ప్రేమకథా చిత్రం `వాల 2` తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుక్కల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథకు మంచి ఆదరణ దక్కింది. కేవలం జంతువుల హావభావాలతో సాగే ఈ ప్రయోగాత్మక చిత్రం చిన్నపిల్లలను, పెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఇలాంటి వెరైటీ కంటెంట్‌కు ఆదరణ దక్కే అవకాశం ఉంది. వచ్చే వారం బాక్సాఫీస్ వద్ద మరింత పోటీ పెరగనుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `కరా` ఏప్రిల్ 30న విడుదలవుతుంది. 1991 నాటి ఇంధన సంక్షోభం నేపథ్యంలో సాగే సర్వైవల్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ధనుష్‌తో పాటు మమిత బైజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి - మోహన్ లాల్ దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `పేట్రియాట్` మే 1న థియేటర్లలోకి రానుంది.
ఇద్దరు లెజెండ్స్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం అభిమానులకు కనువిందు చేయనుంది. ఫహద్ ఫాజిల్ , నయనతార వంటి అగ్ర తారలు నటించడం ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూర్చింది. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలవుతుంది. వీటితో పాటు సౌత్ ఇండియన్ సెన్సేషన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న `ఏక్ దిన్` కూడా మే 1న తెలుగులో `ఒక రోజు` టైటిల్ తో విడుదలవుతుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతోన్న ఈ చిత్రం ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది.
సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమాపై ఇక్కడా మంచి హైప్ నెలకొంది. హిందీ డెబ్యూ మూవీ అయినా? ఆమె సహజ నటన తెలుగు ప్రేక్షకులను మళ్ళీ అలరించబోతోంది. మొత్తంగా స్టార్ హీరోల గైర్హాజరీలో డబ్బింగ్ సినిమాలు ఈ సమ్మర్ బాక్సాఫీస్‌ను ఏలుతున్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో వస్తోన్న ఈ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఏదేమైనా? డబ్బింగ్ దండయాత్ర టాలీవుడ్ ఎగ్జిబిటర్లకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. థియేటర్లకు తాళాలు వేయకుండా కనీసం అనువాద చిత్రాలతోనైనా కళకళలాడుతున్నాయని భావిస్తున్నారు.