అభిమానంపై వాయిదాల దెబ్బ: టాలీవుడ్ రీలీజ్ ఆలస్యాలు, ఫ్యాన్స్ నిరాశ!
తెలుగు చిత్రసీమలో ప్రతిష్టాత్మక చిత్రాల ప్రకటనలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో? వాటి విడుదల తేదీల విషయంలో మాత్రం అంతటి అనిశ్చితి నెలకొంటోంది.
తెలుగు చిత్రసీమలో ప్రతిష్టాత్మక చిత్రాల ప్రకటనలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో? వాటి విడుదల తేదీల విషయంలో మాత్రం అంతటి అనిశ్చితి నెలకొంటోంది. ఒకప్పుడు సినిమా ముహూర్తం రోజే విడుదల తేదీని ప్రకటించి.. దానికి కట్టుబడి నిర్మాణం పూర్తిచేసే పద్ధతి ఉండేది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలు అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాకపోవడం పరిపాటిగా మారింది. ఒక్కసారి కాదు, రెండు మూడు సార్లు విడుదల తేదీలు మారడం అనేది సగటు అభిమాని ఉత్సాహాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందన్నది కాదనలేని నిజం.
సాధారణంగా అభిమానులు ప్రియతమ కథానాయకుడి సినిమా వస్తోందంటే? కొన్ని నెలల ముందు నుంచే పండుగలా సంబరాలు ప్లాన్ చేసుకుంటారు. ఆఫీసులకు సెలవులు పెట్టడం, కటౌట్లు, బ్యానర్లు సిద్ధం చేయడం నుంచి మొదటి రోజు మొదటి షో చూసేందుకు తీవ్రంగా ప్రయాసపడతారు. అయితే ఆఖరి నిమిషంలో లేదా విడుదలకు కొద్ది వారాల ముందు సినిమా వాయిదా పడిందనే వార్త రావడం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ పరిస్థితి ఫ్యాన్స్‌ను మానసిక నిరాశకు గురిచేస్తోంది.
విడుదల తేదీలు వాయిదా పడటమే కాకుండా ఆ వివరాలపై నిర్మాణ సంస్థల నుంచి సరైన స్పందన .. అప్‌డేట్స్ రాకపోవడం అభిమానులను మరింత కలవరపెడుతోంది. కొన్ని పరిస్థితుల్లో కనీస సమాచారం ఇవ్వకుండా నిర్మాతలు నిశ్శబ్దం వహించినప్పుడు రకరకాల పుకార్లు వ్యాపించి ఫ్యాన్ బేస్‌లో అయోమయం నెలకొంటోంది. సామాజిక మాధ్యమాల్లో ఇతర హీరోల అభిమానుల నుంచి వచ్చే ట్రోలింగ్‌ను తట్టుకోవాల్సి రావడం వారిలో చెప్పలేని అసంతృప్తికి కారణమవుతోంది.
భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత కోసం సమయం కేటాయించడం సమర్థనీయమే కావచ్చు. గ్రాఫిక్స్ , విస్తృతమైన పోస్ట్-ప్రొడక్షన్ పనులు .. షూటింగ్ లోపాల వల్ల ఆలస్యం జరగడం సహజమే. కానీ పూర్తి స్థాయిలో ప్లానింగ్ లేకుండా హైప్ పెంచడానికే విడుదల తేదీలను ప్రకటించడం, ఆపై వరుసగా వాయిదాలు వేయడమే అసలు సమస్యగా మారుతోంది. ఇది పరిశ్రమపై ఉండే నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది.
సినిమాల ఆలస్యం వల్ల అభిమానులే కాదు. ఆ చిత్రాలకు సంబంధించి ముందస్తు ప్రచార వేడి కూడా చల్లారిపోతోంది. అనుభవం ఉన్న అగ్ర నటులు సైతం ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ చిత్రసీమల్లో వలె ఏడాది ముందే కచ్చితమైన క్యాలెండర్‌ను ప్లాన్ చేసుకుని షూటింగ్ పనులను గడువులోగా పూర్తిచేసే సంస్కృతి టాలీవుడ్‌లో తిరిగి రావలసిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడు తున్నారు. టైర్ 2 హీరోల చిత్రాల రిలీజ్ లో కూడా ఈ మధ్య కాలంలో తీవ్రమైన జాప్యం జరుగుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ డిలే అనో...పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవ్వలేదనే కారణాలతో రిలీజ్ లను వాయిదా వేస్తున్నారు.
ఇకనైనా దర్శక, నిర్మాతలు సరైన ప్రణాళికతో ముందడుగు వేయాల్సి ఉంది. సినిమా పనులు పూర్తవుతాయని పక్కాగా నమ్మకం కుదిరిన తర్వాతే విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించడం మంచిది. ఏదైనా కారణంతో ఆలస్యమైతే ఆ సమాచారాన్ని అభిమానులకు పారదర్శకంగా తెలపడం ద్వారా అనవసరపు నిరాశను .. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రతికూల వాతావరణాన్ని అరికట్టవచ్చు.
అభిమానుల ఆదరణే సినీ పరిశ్రమకు అసలైన బలం. వారి ఉత్సాహాన్ని, సమయాన్ని , అపరిమితమైన అభిమానాన్ని గౌరవించడం చిత్రసీమ ప్రాథమిక బాధ్యత. బిజినెస్ సమీకరణాలు, విడుదల విండోల ఆధారంగా తేదీలు మారుస్తూ పోతే అభిమానుల్లో ఏర్పడే అనిశ్చితి, నిరాశ సుదీర్ఘ కాలంలో చిత్రాల బాక్సాఫీస్ ప్రదర్శనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.