సినీ కార్మికుల దౌర్జన్యం పెరిగిపోయింది - నిర్మాత ధీరజ్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినీ కార్మికుల బంద్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినీ కార్మికుల బంద్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. సినీ కార్మికులు 30 శాతం వేతనాలు పెంచాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ టాలీవుడ్ లో బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలకి , సినీ కార్మికులకి మధ్య ఎన్నో చర్చలు జరుగుతున్నప్పటికీ అవి సఫలం కావడం లేదు. అటు నిర్మాతలకేమో తలకు మించిన భారం అవుతుంది అని, ఇంకా వేతనాలు పెంచడం మా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తున్నారు. కానీ సినీ కార్మికులు మాత్రం వేతనాలు పెంచాల్సిందేనని,లేకపోతే షూటింగ్ లు జరగనివ్వమంటూ భీష్మించుకు కూర్చున్నారు.
ఒక వైపు డేట్స్ ఇచ్చిన హీరోలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే సినిమా షూటింగ్లు మధ్యలో ఆగిపోవడంతో చిన్న నిర్మాతల పరిస్థితి ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి మారిపోయింది. ఎందుకంటే చాలామంది చిన్న నిర్మాతలు వేరే ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని, తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేస్తారు. కానీ ఇలాంటి సమయంలో బంద్ నిర్వహిస్తే ఫైనాన్షియర్స్ దగ్గర ఇంట్రెస్ట్ పెరిగి, వారికి తలకిమించిన భారం అవుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నిర్మాతలు అందరూ కలిసి నిర్మాత ఎస్కేఎన్ నేతృత్వంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
అయితే ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ..మేం ఎన్నో ఇబ్బందులు పడుతూ సినిమాలు తెరకెక్కిస్తున్నాం.అయితే సినిమాల మీద ఉన్న ఫ్యాషన్ తో మేము ఇంతకుముందు చేసే పనులు కూడా వదిలేసుకొని ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా తీయాలి అంటే సరదా ఏమీ కాదు. అలాగే ఇక్కడ ఎవరు డబ్బులు సంచుల్లో పెట్టుకొని రాలేదు. సినిమా మీద ఉన్న ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాము. కానీ ఇలాంటి సమయంలో ఇలా కార్మికులు బంద్ నిర్వహించి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాలేదు. చాలామంది సినీ కార్మికులు సినిమా షూటింగ్ కోసం ఒకరిద్దరిని పిలిస్తే.. లేదు లేదు మేము 7 లేదా 9 మంది వస్తాం. ఇలా అయితేనే పిలవండి.. లేకపోతే లేదు అంటూ కొన్ని యూనియన్స్ వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు.
కానీ ఇలా పిలిస్తే నిర్మాతకి బడ్జెట్ ఎక్కువవుతుంది. సినిమాకి అవసరమైంది ఇద్దరైతే వాళ్లు తొమ్మిది మంది వస్తారు.ఆ సమయంలో రెమ్యూనరేషన్ విషయంలో ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకి బడ్జెట్ అంత అవసరమా అని సినిమా చూసే ప్రేక్షకులు కూడా అనుకుంటారు. వీరివల్ల సినిమా బడ్జెట్ డబుల్ అవుతుంది. మా పరిస్థితులు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇక టాలీవుడ్ లోని సినీ కార్మికులు బంద్ నిర్వహించిన సమయంలో సోషల్ మీడియాలో కొత్త వాళ్ళు కావాలి అని పోస్టులు పెడితే, వాటి కింద కొన్ని వేల కామెంట్లు వచ్చాయి.
చాలామంది యూత్ ఇండస్ట్రీ లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ ఇండస్ట్రీకి వస్తే వాళ్లు రానిస్తారా.. పాత వాళ్ళే ఉన్నారు కదా.. వాళ్లు మాకు అవకాశాలు రానివ్వరు. డబ్బులు కట్టాల్సి ఉంటుంది కావచ్చు అంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఇండస్ట్రీలోకి కూడా కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి.అలా కొత్త తరం వస్తేనే వారిలో ఉన్న టాలెంట్ ఏంటో బయటపడుతుంది". అంటూ నిర్మాత ధీరజ్ చెప్పుకొచ్చారు. అలాగే నేను మిమ్మల్ని కించపరచడానికో తక్కువ చేయడానికి ఇలా మాట్లాడటం లేదు. మా బాధల్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు.