ఒక్క హిట్ కోసం.. ఐదుగురు ఐదు రూట్లు!
మిడ్ రేంజ్ హీరోల దగ్గర ఇప్పుడు ఒక్క హిట్ విలువ మళ్లీ పెరిగింది. నితిన్, రామ్, సిద్ధు జొన్నలగడ్డ, గోపీచంద్, విశ్వక్ సేన్ అందరూ సినిమాలు చేస్తూనే ఉన్నారు.
మిడ్ రేంజ్ హీరోల దగ్గర ఇప్పుడు ఒక్క హిట్ విలువ మళ్లీ పెరిగింది. నితిన్, రామ్, సిద్ధు జొన్నలగడ్డ, గోపీచంద్, విశ్వక్ సేన్ అందరూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ గత కొంతకాలంగా వాళ్ల మార్కెట్‌కు కావాల్సిన పెద్ద రిజల్ట్ మాత్రం రావడం లేదు. అందుకే తర్వాతి సినిమా దగ్గర ఎవరి ప్లాన్ వాళ్లు మార్చుకుంటున్నారు. ఒకరు కొత్త దర్శకుడితో వెళ్తుంటే, ఇంకొకరు తానే మెగాఫోన్ పట్టేశాడు.
నితిన్‌కు ‘భీష్మ’ తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు. ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ కూడా కలిసి రాలేదు. ఇప్పుడు ‘ధండోరా’ దర్శకుడు మురళీకాంత్ దేవసోత్‌తో ‘అలియాస్ రుక్మిణి’ చేస్తున్నారు. ఇందులో నితిన్ కృష్ణ ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడు. నాని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. పెద్ద యాక్షన్ సెటప్ పట్టుకోకుండా కొత్త దర్శకుడి కథకు వెళ్లడం నితిన్ దగ్గర ఈసారి కనిపిస్తున్న మార్పు. సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది.
రామ్ పరిస్థితి ఇంకోలా ఉంది. ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్లాప్స్ తర్వాత ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు మంచి కామెంట్స్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కాలేదు. ఇప్పుడు తన 23వ సినిమాకు రామ్ తానే కథ రాసుకుని దర్శకత్వం చేస్తున్నాడు. ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. సైకలాజికల్ యాక్షన్ కథగా దీనిని తీసుకెళ్తున్నారు. హీరోగా మరో దర్శకుడి కథ కోసం చూడకుండా తానే సినిమా తీసుకోవడం రామ్ కెరీర్‌లో ఇదే తొలిసారి.
సిద్ధుకు ‘టిల్లు స్క్వేర్’ తర్వాత వచ్చిన సినిమాలు ఆ జోరును కొనసాగించలేకపోయాయి. ‘జాక్’ పనిచేయలేదు. ‘తెలుసు కదా’ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. మధ్యలో ప్రకటించిన ‘కోహినూర్’, ‘బ్యాడాస్’ కూడా అనుకున్న వేగంతో ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జేతో కొత్త సినిమా సెట్ చేసుకున్నాడు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’తో తనకు రెండు పెద్ద హిట్లు ఇచ్చిన సితార బ్యానర్‌లోనే మళ్లీ సినిమా చేయడం సిద్ధుకు కలిసొచ్చే విషయమే.
గోపీచంద్‌కు అయితే ఒక మంచి హిట్ కోసం ఎదురుచూపు ఇంకా ఎక్కువైంది. పక్కా కమర్షియల్, రామబాణం, భీమా, ‘విశ్వం’ వరుసలో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కాలేదు. ఇప్పుడు ఫైట్ మాస్టర్ వెంకట్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సింగా’ చేస్తున్నారు. సెవెంటీ ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్‌లో మళ్లీ యాక్షన్ వైపే వెళ్లినట్టు కనిపించింది. కానీ ఈసారి తెలిసిన దర్శకుడి కాంబినేషన్ కాకుండా కొత్త వ్యక్తిని నమ్మడం గోపీచంద్ తీసుకున్న అతిపెద్ద ఛాలెంజ్.
విశ్వక్ సేన్ చేతిలో మాత్రం వరుసగా మూడు వేర్వేరు సినిమాలు ఉన్నాయి. తానే డైరెక్ట్ చేసిన ‘కల్ట్’తో త్వరలోనే ప్రేక్షకుల వస్తున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్‌తో ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’, సాయికిరణ్ దైదాతో రాజకీయ కథ ‘లెగసీ’ ఉన్నాయి. ‘కల్ట్’తో ముందుగా తన సొంత దర్శకత్వమే కాబట్టి ఇండస్ట్రీలో మంచి బజ్ వచ్చే అవకాశం ఉంది. మిగతా రెండు సినిమాలు కూడా ఇప్పటికే లైన్లో ఉండటంతో, విశ్వక్‌కు వెంటవెంటనే కొత్త క్యారెక్టర్లు చూపించే అవకాశం ఉంది. ఇక ఏ సినిమాతో బిగ్ హిట్ అందుకుంటాడో చూడాలి.