ఇప్పుడు హనుమాన్ - మహేష్ ముచ్చట ఎందుకు మేడం?
ఆ చిన్న సినిమానే హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
టాలీవుడ్ నుంచి ప్రతి సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కావడం పరిపాటిగా వస్తూనే ఉంది. పెద్ద హీరోల సినిమాలతో పాటు, చిన్న హీరోల సినిమాలు సైతం సంక్రాంతి బరిలో అప్పుడప్పుడు నిలవడం మనం చూస్తున్నాం. ప్రతి ఏడాది తంతు జరుగుతోంది. కొన్నిసార్లు పెద్ద హీరోల సినిమాలు ఆధిపత్యం చెలాయిస్తే, కొన్ని సార్లు పెద్ద హీరోల సినిమాలను డామినేట్ చేసి మరీ చిన్న హీరోలు సూపర్ హిట్‌గా నిలుస్తాయి. 2024 సంక్రాంతికి వచ్చిన సినిమాల మధ్య ఫైట్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఆ నాలుగు సినిమాల్లో మూడు పెద్ద హీరోల సినిమాలు కాగా, ఒక్కటి మాత్రం చిన్న హీరో సినిమా. ఆ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలను ప్రేక్షకులు తిరస్కరిస్తే ఆ చిన్న సినిమా సూపర్ హిట్‌గా నిలిచి వందల కోట్ల వసూళ్లు సాధించి అంతా ముక్కున వేలు వేసుకునేలా చేసింది.
తేజ సజ్జా హనుమాన్ సినిమాతో...
ఆ చిన్న సినిమానే హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మిగిలిన వెంకటేష్ నటించిన సైంధవ్, నాగార్జున నటించిన నా సామి రంగ సినిమాలు కనీసం పోటీలో నిలువలేక పోయాయి. అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా మిశ్రమ స్పందన దక్కించుకున్నా మొదటి వారం రోజులు భారీ వసూళ్లు సాధించింది. అయితే రోజులు గడుస్తున్నా కొద్ది హనుమాన్ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కడంతో గుంటూరు కారంకు వసూళ్లు తగ్గి పోయాయి. హనుమాన్ ఆ సమయంలో లేకుండా ఉండి ఉంటే కచ్చితంగా గుంటూరు కారం సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యేవి అనేది బాక్సాఫీస్ వర్గాల మాట. అందుకే హనుమాన్ మేకర్స్ పై, ఆ సినిమా కోసం వర్క్ చేసిన వారిపై మహేష్ బాబు కోపంగా ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మహేష్ బాబుకు మద్దతుగా....
హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపులో చాలా అన్యాయం జరిగిందని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కనీసం సింగిల్ స్క్రీన్స్ ను హనుమాన్ సినిమాకు ఇవ్వలేదని, మల్టీప్లెక్స్ ల్లోనూ గుంటూరు కారంకు పది షో లు ఇస్తే, హనుమాన్ కి ఒకటి రెండు షో లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ పడ్డ తర్వాత సీన్ రివర్స్ అయింది. మెల్ల మెల్లగా సింగిల్ స్క్రీన్స్ పెరిగాయి, మల్టీ ప్లెక్స్ ల్లో స్క్రీన్‌ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే హనుమాన్ నిర్మాత చైతన్య రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ హనుమాన్ సినిమా కోసం మహేష్ బాబు మద్దతుగా నిలిచినట్లు ఆయన పీఆర్ టీం చెప్పారని, తన గుంటూరు కారం సినిమా బయ్యర్లు, నిర్మాతలతోనూ ఆయన గట్టిగా మాట్లాడి థియేటర్లు ఇప్పించారని చైతన్య రెడ్డి ఇప్పుడు చెప్పడం చర్చనీయాంశం అయింది.
మూడు ఏళ్ల క్రితం ముచ్చట ఇప్పుడు ఎందుకు చైతన్య రెడ్డి తెర ముందుకు తీసుకు వచ్చారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు హనుమాన్ సినిమాకు మహేష్ బాబు అన్యాయం చేయాలని ప్రయత్నించాడు అంటూ విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించాలనే ఉద్దేశంతో చైతన్య రెడ్డి ఇలా ముందుకు వచ్చి ఉంటారు. కొత్త వాళ్ళు, మంచి కథతో సినిమా తీశారు, బాగుందని మమ్ములను ఆ సమయంలో మహేష్ గారు అభినందించినట్లు ఆయన పీఆర్ టీం చెప్పారు అని అన్నారు. థియేటర్ల విషయంలోనూ ఆయన నుంచి సహకారం అందింది. ఆయన్ను ఈ విషయంలో ఒక్క మాట అనేందుకు వీలు లేదు అన్నట్లుగా చైతన్య రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఇన్నాళ్లు ఆయన్ను విమర్శించిన వారు సైలెంట్ అవుతారు.