సినీప‌రిశ్ర‌మ‌లో చీక‌టి కోణం గురించి ఓపెనైన జాతీయ ఉత్త‌మ‌న‌టుడు!

పరిశ్రమ ఏదైనా ప్రతిభకు సరైన గుర్తింపు దక్కకపోవడం అనే అంశం అన్ని చిత్రసీమల్లోనూ కనిపించే చేదు నిజమే.

Update: 2026-10-24 19:30 GMT

పరిశ్రమ ఏదైనా ప్రతిభకు సరైన గుర్తింపు దక్కకపోవడం అనే అంశం అన్ని చిత్రసీమల్లోనూ కనిపించే చేదు నిజమే. అది బాలీవుడ్ అయినా, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ లేదా శాండల్‌వుడ్ అయినా.. పరిస్థితులు దాదాపు ఒక్కటే. నటుల అసలు నైపుణ్యాన్ని గుర్తించి, వారి నుంచి మరింత ప్రతిభను వెలికితీయగలమని భావించే దర్శకులు-నిర్మాతలు చాలా తక్కువ మందే ఉంటారు. మెజారిటీ పరిశ్రమ వర్గాలు మాత్రం నటులకు అవకాశాలు ఇచ్చేటప్పుడు చాలా పరిమితులు, మూస ధోరణులనే ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇదే విషయంపై జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పేయి తాజాగా చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలోని నగ్న సత్యాన్ని బయటపెట్టాయి.

బాలీవుడ్ తీరుపై మనోజ్ బాజ్‌పేయి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టాలెంటెడ్ నటులకు సరైన పాత్రలు కేటాయించకుండా.. వారిని ఒకే రకమైన మూస పాత్రలకు పరిమితం చేసి వారి కెరీర్‌ను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన కొత్త చిత్రం `గజబ్ రాత్` ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నా తనలోని నటనలో కేవలం 25 శాతాన్ని మాత్రమే ప్రేక్షకులు చూశారని.. మిగిలిన 75 శాతం ప్రతిభ ఇంకా అన్వేషణకు గురికాలేదని చెప్పారు. ఈ సినిమాలో ఆయనతో పాటు నుష్రత్ భరూచా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్, దివ్య దత్తా తదితరులు నటించారు.

బాలీవుడ్‌లో గొప్ప ప్రతిభావంతులను కూడా సెట్స్‌లో సరైన పద్ధతిలో గౌరవించకుండా.. చిన్న చూపు చూసి వారి కెరీర్‌లను చిదిమేసిన చరిత్ర ఇండస్ట్రీకి ఉందని బాజ్‌పేయి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన గుర్తింపు దక్కక ఎంతో మంది నటులు కాలక్రమేణా కనుమరుగైపోయారని వ్యాఖ్యానించారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక పరిస్థితి కొంత మారినా నటుడిగా తనలోని ఆకలి, కసి ఇంకా తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. మనోజ్ బాజ్‌పేయి వ్యాఖ్యలు కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా.. టాలీవుడ్‌ సహా అన్ని చిత్రసీమల్లోని నటీనటుల వేదనకు అద్దం పడుతున్నాయి.

తెలుగు చిత్రసీమలో కూడా అనేకమంది నటీనటులు, హీరోయిన్లు తమ నటనకు తగ్గ పాత్రలు దక్కడం లేదని పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గ్లామర‌స్ పాత్రలకే పరిమితం చేస్తున్నారని.. తమలోని నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించే ఆఫర్లు రావడం లేదని పలువురు కథానాయికలు వాపోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఎంతో మంది టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, సహాయ నటులు సైతం ఒకసారి ఒక తరహా పాత్రలో మెరిస్తే.. జీవితాంతం అవే తరహా పాత్రలకే టైప్ కాస్ట్ అయిపోతున్నామని.. కొత్త తరహా పాత్రలు ఇచ్చేందుకు దర్శకులు సాహసించడం లేదని పేర్కొన్నారు.

అగ్ర హీరోలు, సీనియర్ ఆర్టిస్టులు కూడా కొన్నిసార్లు తాము రొటీన్ కథలు, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లకే పరిమితం కావాల్సి వస్తోందని.. తమలోని నటుడికి సంతృప్తినిచ్చే భిన్నమైన పాత్రలు లభించడం అరుదుగా మారిందని వ్యాఖ్యానించారు. నటులలోని పూర్తి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకునేలా బలమైన కథలను, విలక్షణమైన పాత్రలను రూపొందించినప్పుడే నటీనటుల ప్రతిభకు నిజమైన న్యాయం జరుగుతుందని..అలాగే పరిశ్రమ కూడా వైవిధ్యమైన సినిమాలతో పురోగమిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Tags:    

Similar News