టికెట్ రేట్లు కాదా?..బలం లేని కథలే కారణమా?
ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్ బాబు `సైక్ సిద్ధార్ధ్` ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.;
టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా మోనోపలి చేస్తున్న వాళ్లు కొందరు అంటున్న మాట స్టార్ స్టేటస్, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమా అయితేనే దానికి థియేటర్లు లభిస్తాయని, అలా కాకుండా ఊరూ పేరూ లేని వారితో సినిమాలు చేస్తే దాన్ని రిలీజ్ చేయడం కష్టమని, అలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రారని స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. చిన్న సినిమాలని ఆదిలోనే తొక్కేయడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం వాటి వెనకే పడుతూ నచ్చిన సినిమాకు ఎలాంటి డబ్బులు పెట్టకుండా థియేటర్లలో రిలీజ్ చేసి లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్ బాబు `సైక్ సిద్ధార్ధ్` ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. `ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడం లేదని, పరిశ్రమే వారిని దూరం చేసుకుంటోందన్నారు. మంచి కంటెంట్‌తో వస్తే తప్పకుండా ఆదరిస్తున్నారని, అందుకు లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్ లాంటి సినిమాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. కథాబలం లేకుండా నిర్మించే సినిమాల వల్ల ఇండస్ట్రీకే కాకుండా ప్రేక్షకులకు నష్టం వాటిల్లుతోందన్నారు.
అంతే కాకుండా నందు హీరోగా వరుణ్‌రెడ్డి రూపొందించిన `సైక్ సిద్ధార్ధ్` ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండటం వల్లే తాను ఈ చిత్రాన్ని ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. డి. సురేష్ బాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ ఒకటి మొదలైంది. పెరిగిన టికెట్ రేట్ల కారణంగా సగటు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే చర్చ జరుగుతున్న వేళ సురేష్ బాబు బలంలేని కథల కారణంగానే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనడం ఆసక్తికరంగా మారింది.
గతంలో సినిమా ఎలా ఉన్నా, ఫ్లాప్ సినిమా అయినా సరే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. స్టార్ హీరో సినిమా అయినా సరే ఫ్లాప్ అని తెలిసినా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఎంత మంచి సినిమా అని ప్రచారం చేసినా ఆశించిన స్థాయలో టికెట్‌లు తెగడం లేదు. కారణం సామాన్యుడు భరించలేని స్థాయిలో టికెట్ రేట్లు పెరగడమే. ఆ కారణంగానే థియేటర్లకు ప్రేక్షకులు రావడం రికార్డు స్థాయిలో తగ్గించారు.
దీంతో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఒక దశలో ఫ్లాప్ సినిమా అయినా సరే చూడటానికి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఇప్పుడు రావడానికి ఆసక్తిని ప్రదర్శించకపోవడం టికెట్ రేట్లేనని అందరికీ తెలుసు. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడకుండా, కథాబలం లేని సినిమాల వల్లే ఇండస్ట్రీకి ప్రేక్షకులు దూరమవుతున్నారని ఇండస్ట్రీ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పలువురు కామెంట్‌లు చేస్తున్నారు. కంటెంట్ ఓకే కానీ టికెట్ రేట్లని అదుపు చేయాలనే ఆలోచన చేస్తేనే ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటుందని, భారీ బడ్జెట్లతో సినిమాలు చేశామని ఒకటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచేస్తామనడం కరెక్ట్ కాదని, ఈ విషయంలో `ధురంధర్`ని చూసి మన వాళ్లలో మార్పు రావాలని సెటైర్లు వేస్తున్నారు.