'మృత్యుంజయ్' మూవీ రివ్యూ
గత వారం తన శైలి కామెడీ సినిమా విష్ణు విన్యాసంతో పలకరించాడు శ్రీ విష్ణు. కానీ అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు.;
నటీనటులు: శ్రీ విష్ణు - రెబ్బా మోనికా జాన్ - బేబీ ఊహ- సుదర్శన్- రచ్చ రవి - ఐశ్వర్య- అయ్యప్ప పి.శర్మ- బాలాదిత్య - సిజ్జు - కృష్ణ కౌశిక్ - నందగోపాల్ తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: విద్యాసాగర్ చింత
నిర్మాతలు: సందీప్ గుణ్ణం - వినయ్ చిలకపాటి
రచన- దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
గత వారం తన శైలి కామెడీ సినిమా విష్ణు విన్యాసంతో పలకరించాడు శ్రీ విష్ణు. కానీ అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడతను థ్రిల్లర్ మూవీ 'మృత్యుంజయ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ రూపొందించిన ఈ చిత్రం చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. మరి సినిమాగా కూడా మృత్యుంజయ్ మెప్పించిందా? తెలుసుకుందాం పదండి.
కథ: మృత్యుంజయ్ అలియాస్ జై (శ్రీవిష్ణు) ఒక పత్రికలో సంస్మరణ ప్రకటనలు సేకరించే మార్కెటింగ్ ఉద్యోగి. చాకచక్యంగా ప్రకటనలు రాబట్టే క్రమంలో అతడికి ప్రతి చిన్న విషయాన్నీ నిశితంగా పరిశీలించే నైపుణ్యం అబ్బుతుంది. అలా ఒక చావు ఇంటికి ప్రకటన కోసం వెళ్లిన అతను చిన్నారిలో తనను తాను చూసుకుని.. చనిపోయిన ఆ పాప తండ్రి వెనుక మిస్టరీని ఛేదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు తెలుసుకుంటాడు. అనేక మరణాలతో లింక్ ఉన్న ఈ కేసును ఛేదించడం కోసం అతను రంగంలోకి దిగుతాడు. కానీ పోలీసులు మాత్రం అతణ్ని పట్టించుకోరు. తన థియరీలను కొట్టిపడేస్తారు. కానీ మృత్యుంజయ్ డీలా పడకుండా ఈ మరణాల వెనుక ఉన్న హంతకుడిని వెతికి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు.. అతను చేసిన హత్యల వెనుక మిస్టరీ ఏంటి.. చివరికి జై ఆ హంతకుడిని పట్టుకుని తన కథ ముగించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: థ్రిల్లర్ సినిమాలు తీయడంలో మలయాళ దర్శకుల పనితనమే వేరు. ఓటీటీ విప్లవం మొదలయ్యాక మన ప్రేక్షకులు మలయాళ థ్రిల్లర్లకు బాగా అలవాటు పడి.. ఈ తరహా చిత్రాలు తెలుగులో రావే అంటూ నిట్టూర్చడం మామూలైపోయింది. కానీ ప్రతి ఇండస్ట్రీలోనూ దర్శకులు ఇక్కడ పాపులర్ అయిన జానర్లలోనే సినిమాలు తీస్తుంటారు. తాము ప్రభావితం అయిన మేరకే కథలు రాసి తెరకెక్కిస్తుంటారు. మన దగ్గర పకడ్బందీ థ్రిల్లర్లు అని చెప్పుకోదగ్గ సినిమాలు తక్కువే. ఐతే సుకుమార్ శిష్యుడైన హుస్సేన్ షా కిరణ్.. మన బలం కాదనుకున్న జానర్లో నియర్ పర్ఫెక్ట్ థ్రిల్లర్ తీసి మెప్పించాడు. వరుస హత్యలు చేసే ఒక కిల్లర్.. అతణ్ని పట్టుకునే హీరో.. ఈ ఫార్మాట్లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ.. ఇలాంటి స్టోరీనే డిఫరెంట్ ట్రీట్మెంట్.. ఆసక్తికర నరేషన్ తో ఆద్యంతం రసవత్తరంగా నడిపించి మార్కులు కొట్టేశాడు కిరణ్. అక్కడక్కడా కొన్ని లోపాలున్నప్పటికీ.. రెండు గంటల పాటు థ్రిల్లర్ ప్రియులను కుదురుగా కూర్చోబెట్టి ఉత్కంఠను పంచడంలో మృత్యుంజయ్ విజయవంతమైంది.
మృత్యుంజయ్ చాలా సింపుల్ కథతో తెరకెక్కిన సినిమా. తన ఐడెంటిటీ బయట పడకుండా పకడ్బందీగా హత్యలు చేసే ఒక తెలివైన కాంట్రాక్ట్ కిల్లర్.. చిన్న తీగ దొరికితే దాన్ని పట్టుకుని డొంకంతా లాగి ఆ కిల్లర్ ఆట కట్టించే హీరో.. వీరి మధ్య నడిచే క్యాట్ అండ్ మౌస్ గేమే ఈ సినిమా. హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్స్ ప్రేక్షకుల్లో ఆద్యంతం ఒక క్యూరియాసిటి రేకెత్తిస్తూ కథనాన్ని రక్తి కట్టిస్తాయి. కథ తాలూకు సెటప్ చాలా సింపుల్ గా ఉండడమే కాదు.. ఎక్కువ క్యారెక్టర్లు కూడా లేకపోవడం మృత్యుంజయ్ ప్రత్యేకత. ప్రేక్షకుల బుర్రలు బద్దలు కొట్టుకునేలా మరీ ఎక్కువ చిక్కుముడులు కూడా లేకపోయినా.. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న మాత్రం ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటుంది. మొదట్లో ఓ బిల్డప్ ఇచ్చి తర్వాత తేల్చేసే సినిమాలా కాకుండా.. కథనం గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా మిడిల్ పోర్షన్స్ నుంచి మృత్యుంజయ్ స్థాయి మారుతుంది. ముగింపులో సినిమా వేరే లెవెల్ కు వెళ్తుంది.
మృత్యుంజయ్ మొదలైన తీరు చూస్తే అంత మంచి ఇంప్రెషన్ ఏమి కలగదు. సంస్మరణ ప్రకటనలు సేకరించే మార్కెటింగ్ ఉద్యోగిగా హీరో పాత్ర పరిచయం ఆసక్తికరంగానే అనిపించినా.. తర్వాతి సన్నివేశాలు సాధారణంగా సాగుతాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్లలో హత్య.. దాని చుట్టూ పరిణామాలు.. మలుపులను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ ఇందులో మాత్రం ఎమోషనల్ టచ్ తో ఆ సీన్లు సాగుతాయి. దీంతో థ్రిల్ కోసం చూస్తే ఈ సెంటిమెంట్ ఏంటి అనిపిస్తుంది. కానీ తనది కాని ఒక టాస్కును హీరో నెత్తికి ఎత్తుకోవడానికి బలమైన కారణం ఉండాలనే దర్శకుడు ఈ సన్నివేశాలు పెట్టాడని తర్వాత అర్థం అవుతుంది. మొదట్లో పెద్దగా ప్రాధాన్యం లేనట్లుగా అనిపించే చాలా విషయాలను రెండో అర్థంలో కథలో కీలకమైన మలుపులకు లింక్ పెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాల్లో విలన్ని చివరిదాకా దాచి పెట్టడం ఒక స్టైల్. అలా కాకుండా విలన్ని మధ్యలో ఓపెన్ చేసేసి.. అతన్ని పట్టుకోవడం మీద కథను నడిపించడం ఇంకో స్టైల్. కిరణ్ రెండో మార్గంలోనే నడిచాడు. ఇంటర్వెల్ దగ్గర విలన్ ఫేస్ బయటపెట్టి హీరోకు అతడికి మధ్య మంచి ఫేసాఫ్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు.
ద్వితీయార్ధంలో హీరో-విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులతో కథనం రసవత్తరంగా సాగుతుంది. హీరోను ఎలివేట్ చేయడం కోసం చూడకుండా.. విలన్ పాత్రనే హైలైట్ చేస్తూ గేమ్ అతనే ఆడుతున్నట్లు చూపించడం ద్వారా దర్శకుడు తన ప్రత్యేకతను చాటాడు. దీని వల్లే కథనం రక్తి కట్టింది. చివర్లో హీరోకు ఇవ్వాల్సిన ఎలివేషన్ ఇచ్చేశాడు. పతాక సన్నివేశాలు సినిమాను వేరే స్థాయిలో నిలబెడతాయి. హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్.. డైలాగ్ ప్లే.. చివరగా హీరో ఇచ్చే కౌంటర్ అదిరిపోయాయి. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల పాత్రను తేల్చేయడం.. వారి ఇన్వెస్టిగేషన్ తీరును సిల్లీగా చూపించడం మాత్రం అంతగా ఆకట్టుకోదు. సంబంధిత సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. హీరోయిన్ పాత్రను రొటీన్ గా చూపించకపోవడం బాగున్నా.. ఆ పాత్ర వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రతికూలతల్ని పక్కన పెడితే.. మృత్యుంజయ్ రెండు గంటల తక్కువ నిడివిలో ఎక్కువ శాతం ఎంగేజింగ్ గా.. ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను అలరిస్తుంది. థ్రిల్లర్ ప్రియులకు ఇది మంచి కాలక్షేపం.
నటీనటులు: ఈ మధ్య కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీ విష్ణు.. 'మృత్యుంజయ్'తో మళ్లీ పాత స్టయిల్లోకి మారాడు. సీరియస్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఐతే గతంలో సీరియస్ క్యారెక్టర్లు చేసినా.. ఇలాంటి థ్రిల్లర్ మూవీలో నటించడం మాత్రం ఇదే తొలిసారి. క్యారెక్టర్ చాలా కన్విన్సింగ్ అనిపించేలా శ్రీ విష్ణు నటన సాగింది. పాత్రకు అవసరమైన కాన్ఫిడెన్స్ చూపిస్తూనే.. ఎమోషనల్ సీన్లలో హృద్యమైన నటనతో శ్రీ విష్ణు ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో అతడికి కొందరు కొత్త అభిమానులు తయారు కావచ్చు. రెబ్బా మోనికాది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. హీరోతో లవ్ ట్రాక్.. రొమాన్స్ లాంటివేమీ లేకుండా.. కథకు అవసరమైన పాత్రలో ఆమె నటించింది. కమిషన్ పాత్రలో తన పెర్ఫామెన్స్ ఓకే. విలన్ పాత్ర పోషించిన కొత్త నటుడు సినిమాలో పెద్ద సర్ప్రైజ్. బాగా అనుభవం ఉన్న వాడిలా నటించాడు. సటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. విలన్ అసామాన్యుడు అనిపించేలా అతను పెర్ఫామ్ చేశాడు. సుదర్శన్.. రచ్చ రవి.. అయ్యప్ప శర్మ.. ఐశ్వర్య సహాయ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం: 'మృత్యుంజయ్'కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. పాటలు లేని ఈ సినిమాలకు కాలభైరవ నేపథ్య సంగీతంతో బలం చేకూర్చే ప్రయత్నం చేశాడు. థ్రిల్లర్ సినిమాల శైలికి నప్పేలా రేసీ బీజీఎం అందించాడు. కొన్ని చోట్ల స్కోర్ కాస్త లౌడ్ అనిపించినా.. ఓవరాల్ గా కాలభైరవ మంచి పనితనమే చూపించాడు. విద్యాసాగర్ చింత ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. అతను ఎంచుకున్న కలర్ థీమ్స్.. సినిమా నడతకు సరిపోయాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ల తన నైపుణ్యాన్ని చూపించారు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఈ కథకు సపోర్ట్ చేసిన నిర్మాతలు అభినందనీయులు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్.. తనది సుకుమార్ స్కూల్ అని బలంగా చాటి చెప్పాడు. థ్రిల్లర్ సినిమాల్లో రొటీన్ అనిపించే కథే అయినా.. స్క్రీప్ ప్లేతో అతను మ్యాజిక్ చేశాడు. ఇంటలిజెంట్ ప్లేతో ప్రేక్షకులను అరెస్ట్ చేయగలిగాడు. హీరో.. విలన్ పాత్రలను అతను రాసుకున్న విధానం.. సినిమాను ముగించిన తీరు రచయితగా-దర్శకుడిగా తన పనితనాన్ని చాటుతాయి.
చివరగా: మత్యుంజయ్.. జయకేతనం
రేటింగ్- 3/5